జాతీయం

ఇదేంటి గోవిందా - దేవుడితోనే పరాచకాలా - తమిళ సినిమాపై విమర్శలు

తమిళ చిత్ర పరిశ్రమలో కొత్త వివాదంలో చిక్కుకుంది. తిరుమల శ్రీవారి పాటనే ర్యాప్‌ సాంగ్‌ మార్చి పారేసింది డీడీ నెక్ట్స్‌ లెవల్‌ సినిమా టీమ్‌. ఆ పాటను తొలగించాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నా.. ససేమిరా అంటోంది చిత్ర బృందం. అంతేకాదు.. సెన్సార్‌ బోర్డ్‌కి లేని అభ్యంతరం మిగిలిన వారికి ఎందుకని ప్రశ్నిస్తోంది. దీంతో.. ఈ వివాదం మరింత ముదిరింది. సినిమానే బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి హిందూ సంఘాలు. అసలు వివాదం ఏంటంటే..?

తిరుమల శ్రీవారిని.. గోవింద నామాలతో కొలుస్తుంటారు భక్తులు. శ్రీనివాస గోవింద.. శ్రీవేంకటేశ్వర గోవింద.. అనే పాట వింటూ భక్తిలో మునిగిపోతారు. ఆ కలియుగ దైవాన్ని తలుచుకుని.. మనసారా ప్రార్థించుకుంటారు. అలాంటి.. భక్తి పాటను.. పవిత్రమైన పాటను.. ర్యాప్‌ సాంగ్‌గా మార్చేసింది డీడీ నెక్ట్స్‌ లెవల్‌ సినిమా టీమ్. ఈ సినిమాలోని కిస్సా-47 సాంగ్‌.. గోవింద నామాల పాటకు ప్యారడీ సాంగ్‌గా మారింది. ఈ పాట విన్న భక్తులు.. భగ్గుమంటున్నారు. దేవుడితో పరాచకాలు ఆడుతారా అంటూ మండిపడుతున్నారు. తిరుమల శ్రీనివాసుడిని అవమానించారంటూ.. ఫైరవుతున్నారు. వెంటనే సినిమా నుంచి ఆ పాటను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

డీడీ నెక్ట్స్‌ లెవల్‌ సినిమా.. తమిళ నటుడు, కామెడీ యాక్టర్‌ సంతానం హీరీగా నటించారు. ఈ సినిమాలోని కిస్సా-47 సాంగ్‌పై వివాదం రాజుకుంది. ఈ వివాదంపై సినిమా హీరో సంతానం సీరియస్‌గా స్పందించారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని తాము అవమానించలేదని అన్నారు. అంతేకాదు.. ఈ సినిమాకు సెన్సార్‌ సర్టికెట్‌ వచ్చింది. సెన్సార్‌ బోర్డుకు లేని అభ్యంతరం.. మిగిలిన వారికి ఎందుకని ప్రశ్నించారు. రోడ్డు మీద వెళ్లే వారందరికీ తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ పొగరుగా మాట్లాడారు సంతానం. దీంతో.. హిందూ సంఘాలు మరింత భగ్గుమన్నాయి.

గోవింద నామాలు అంటే.. ఎంతో పరిత్రమైనవి. అలాంటి వాటిని.. ర్యాప్‌ సాంగ్‌గా మార్చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందే కాకుండా.. సినిమా టీమ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతోందంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే పలు పోలీస్‌స్టేషన్లలో ఈ సినిమాపై కేసులు నమోదయ్యాయి. తిరుపతి జనసేన నేత కిరణ్‌ రాయల్‌ కూడా రంగంలోకి దిగారు. తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి తిరుమల దర్శనానికి వచ్చిన సందర్భంగా ఆయన్ను కలిశారు కిరణ్‌ రాయల్‌. డీడీ నెక్ట్స్‌ లెవల్‌ సినిమాలోని.. కిస్సా-47పాటను చూపించి.. తిరుమల శ్రీవారి పాటను ఎలా బద్నాం చేశారో చెప్పారు. వెంటనే సినిమాలోని ఆ పాటను తొలగించాలని డిమాండ్‌ చేశారు. అవసరమైతే సినిమాను కూడా బ్యాన్ చేయాలని డిమాండ్‌ చేశారాయన.

తమిళనాడు ప్రతిపక్ష నేతగా.. ఈ విషయంలో చొరవ తీసుకోవాలని పళనిస్వామిని కోరారు జనసేన నేత కిరణ్‌ రాయల్‌. ఆ పాటను తొలగించేలా.. తమిళనాడు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, ఆయన కుమారుడు నాస్తికులైతే.. కావొచ్చు గానీ.. తిరుమల శ్రీనివాసుడి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తుంటే ఎలా ఊరుకుంటామని నిలదీశారు. వెంటనే డీడీ నెక్ట్స్‌ లెవల్‌ సినిమాలోని కిస్సా-47 సాంగ్‌ను తొలగించాలని.. లేదా సినిమా మొత్తాన్ని బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button