
ఖమ్మం, క్రైమ్ మిర్రర్:- ఖమ్మం జిల్లాలో దొంగల దౌర్జన్యం మళ్లీ పెరుగుతోంది. తాజాగా నగర శివారులోని గొల్లగూడెంలో, సత్తుపల్లి పట్టణంలో దొంగలు చోరీలకు యత్నించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున ముగ్గురు దొంగలు గొల్లగూడెం కాలనీలోకి చొరబడ్డారు. కాలనీలోని ఇళ్ల చుట్టూ తిరుగుతూ చోరీకు అవకాశాలు వెతికారు. చివరకు ఓ తాళం వేసిన ఇంట్లోకి ప్రవేశించి గదులన్నీ కలియతిరిగారు. ఈ దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఉదయం ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఖానాపురం హవేలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read also : కమలం గూటిలో చేరిన గువ్వల
ఇక సత్తుపల్లి పట్టణంలోని విరాట్ నగర్ శివారు, పీవీ నరసింహారావు సింగరేణి కాలరీస్ పరిసరాల్లో కూడా దొంగలు చోరీలకు ప్రయత్నించారు. ఇక్కడ కూడా నిందితుల కదలికలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.తాజా ఘటనలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పహారా బలోపేతం చేయడంతో పాటు వీధి దీపాల మరమ్మతులు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ రెండు ఘటనల దర్యాప్తు వేగవంతం చేస్తూ త్వరలోనే నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.
Read also : అప్డేట్ అన్నారో అంతే గతి.. లింక్స్ పట్ల తస్మాత్ జాగ్రత్త!