రాజకీయాలను కుదిపేసిన విమాన ప్రమాదాలు.. బలైన నేతలు వీరే..!

భారత రాజకీయ చరిత్రలో విమానాలు, హెలికాప్టర్లతో సంభవించిన ప్రమాదాలు ఎన్నో కీలక నాయకులను అకాలంగా దూరం చేశాయి.

భారత రాజకీయ చరిత్రలో విమానాలు, హెలికాప్టర్లతో సంభవించిన ప్రమాదాలు ఎన్నో కీలక నాయకులను అకాలంగా దూరం చేశాయి. అజిత్ పవార్‌ మరణవార్త నేపథ్యంలో, గతంలో ఇటువంటి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ నేతల ఘటనలు మరోసారి గుర్తుకు వస్తున్నాయి. ప్రజాజీవితంలో కీలక పాత్ర పోషించిన నాయకుల అకాల మరణాలు దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించిన వై.ఎస్. రాజశేఖర రెడ్డి పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2009 సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో పర్యటనకు వెళ్లిన సమయంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన తెలుగు రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా విషాదంలో ముంచింది.

లోక్‌సభ స్పీకర్‌గా దేశ రాజకీయాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన జి.ఎం.సి. బాలయోగి కూడా హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 2002 మార్చి 3న కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలో జరిగిన ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. అదే విధంగా, ప్రముఖ నటి, రాజకీయ కార్యకర్త సౌందర్య 2004లో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా బెంగళూరు సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు.

జాతీయ స్థాయిలో చూస్తే.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే కొనసాగుతోంది. 1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించారని అధికారికంగా చెబుతున్నప్పటికీ, దీనిపై భిన్నాభిప్రాయాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఘటన భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో అత్యంత చర్చనీయాంశంగా నిలిచింది.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ కూడా విమాన ప్రమాదంలో అకాలంగా కన్నుమూశారు. 1980 జూన్ 23న ఢిల్లీలో గ్లైడర్ నడుపుతుండగా జరిగిన ప్రమాదంలో ఆయన మరణించారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మంత్రి మాధవరావు సింధియా 2001లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

భారత రాజకీయ చరిత్రలో మరో విషాదకర సంఘటనగా గుజరాత్ రెండో ముఖ్యమంత్రి బల్వంతరాయ్ మెహతా మరణం నిలిచింది. 1965 ఇండో-పాక్ యుద్ధ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని పాకిస్తాన్ కూల్చివేయడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.

ఇటీవలి కాలంలో దేశాన్ని కుదిపేసిన ఘటనగా భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మరణం గుర్తుండిపోతుంది. 2021 డిసెంబర్ 8న తమిళనాడులోని కూనూర్ వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయనతో పాటు పలువురు సైనిక అధికారులు మృతి చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇవే కాకుండా, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డోర్జీ ఖండు, హర్యానా మంత్రులుగా ఉన్నప్పుడు ఓ.పి. జిందాల్, సురేందర్ సింగ్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి గుర్నామ్ సింగ్ వంటి నేతలు కూడా విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.

ALSO READ: RBI New Rules: ఏంటీ.. నిజమా.. లోన్ తీసుకున్నా EMI కట్టాల్సిన పనిలేదా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button