Monday, February 23, 2026
Homeజాతీయంఈ వారం ప్రేక్షకులను సందడి చేయనున్న చిత్రాలు ఇవే!

ఈ వారం ప్రేక్షకులను సందడి చేయనున్న చిత్రాలు ఇవే!

తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ నెల 27 ప్రత్యేకమైన తేదీగా మారబోతోంది. ఒకే రోజు పలు విభిన్న కథాంశాలతో రూపొందిన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానుండటంతో చిత్రసీమలో ఆసక్తికర వాతావరణం నెలకొంది. ప్రేమ, వినోదం, భావోద్వేగం, సామాజిక అంశాలు ఇలా భిన్న శైలుల్లో తెరకెక్కిన చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ముందుగా శ్రీవిష్ణు కథానాయకుడిగా, యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో రూపొందుతున్న ‘విష్ణు విన్యాసం’ చిత్రం విడుదల తేదీని ముందుకు జరిపినట్లు చిత్ర బృందం ప్రకటించింది. తొలుత 28న విడుదల చేయాలని భావించిన ఈ చిత్రాన్ని ఒక రోజు ముందుగానే అంటే 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆద్యంతం వినోదభరితంగా సాగే ప్రేమకథా చిత్రంగా దీన్ని తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. జాతకాలపై మోజు ఉన్న వ్యక్తిగా శ్రీవిష్ణు వినోదాత్మక పాత్రలో కనిపించనుండగా, కథానాయికగా నయన్ సారిక నటిస్తున్నారు. కీలక పాత్రల్లో సత్య, బ్రహ్మాజీ తదితరులు కనిపించనున్నారు. వినోదంతో పాటు ప్రేమలోని ఆసక్తికర మలుపులు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

ఇక నిజజీవిత సంఘటనల నేపథ్యంతో రూపొందిన ‘ది కేరళ స్టోరీ 2’ గోస్ బియాండ్ కూడా 27న విడుదలకు సిద్ధమైంది. ప్రేమ పేరుతో మోసపోయి కుటుంబాల నుంచి దూరమయ్యే యువతుల కథలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రం సామాజిక అంశాలను ప్రతిబింబించే ప్రయత్నం చేసింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న తొలి భాగానికి కొనసాగింపుగా రూపొందిన ఈ చిత్రానికి కామాఖ్యా నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించగా, విపుల్ అమృత్‌లాల్ షా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ప్రధాన పాత్రల్లో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా నటించారు. భావోద్వేగపూరిత సన్నివేశాలతో పాటు ఆలోచింపజేసే అంశాలు ఈ చిత్రంలో ఉండనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

అదే రోజు ప్రేక్షకుల ముందుకు రానున్న మరో చిత్రం ‘ది రైజ్ ఆఫ్ అశోక’. ఇందులో సతీశ్ నీనసాం, సప్తమి గౌడ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వినోద్ వి దుండలే దర్శకత్వం వహించగా, నిర్మాణ బాధ్యతలను వర్ధన్ హరి, జైష్ణవి, సతీశ్ చేపట్టారు. బలమైన భావోద్వేగాలతో పాటు స్పష్టమైన సందేశం అందించే చిత్రంగా దీన్ని తీర్చిదిద్దినట్లు యూనిట్ వెల్లడించింది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఇది తప్పక నచ్చుతుందని వారు చెబుతున్నారు.

ఇదే తేదీన విడుదల కానున్న మరో చిత్రం ‘సన్ ఆఫ్’. ఇందులో సాయిసింహాద్రి హీరోగా నటిస్తూ నిర్మాణ బాధ్యతలు కూడా నిర్వహించారు. ఈ చిత్రానికి బత్తుల సతీష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తూ రూపొందించబడినట్లు సమాచారం. ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని తాకేలా కథను మలిచామని, థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు బరువెక్కిన గుండెలతో బయటకు రావాల్సిందేనని చిత్ర బృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

మొత్తంగా చూస్తే 27న వివిధ శైలుల్లో రూపొందిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. వినోదం కోరుకునే వారికి ఒక చిత్రం, సామాజిక అంశాలపై ఆసక్తి ఉన్నవారికి మరో చిత్రం, భావోద్వేగ ప్రధాన కథలు ఇష్టపడే వారికి మరొకటి ఇలా ప్రతి వర్గ ప్రేక్షకుడిని ఆకర్షించేలా ఈ వారాంతం చిత్రసీమ సందడిగా మారనుంది.

ALSO READ: తిరుమల క్యూలైన్‌లో భక్తురాలిని కాటేసిన పాము

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments