
విశాఖపట్నం నగరానికి పర్యాటక ఆకర్షణగా నిలిచిన కైలాసగిరిలో శుక్రవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. కొండపై పర్యాటకులను తీసుకువెళ్లే టాయ్ రైలు ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ కావడంతో వెనక్కి జారింది. స్టేషన్ సమీపంలోకి రాగానే ఈ ఘటన జరగడంతో అక్కడ క్షణాల పాటు భయానక పరిస్థితి నెలకొంది. రైల్లో ప్రయాణిస్తున్న పర్యాటకులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు రైలు కొంత దూరం వెనక్కి వెళ్లి ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో వంద మందికి పైగా ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో నిర్వాహకులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
కైలాసగిరిలోని టాయ్ రైలు పర్యాటకులను కొండపై చుట్టూ తిప్పుతూ ప్రకృతి అందాలను చూపించేలా ఏర్పాటు చేశారు. సాధారణంగా ఈ రైలు ద్వారా రోజూ వందలాది మంది పర్యాటకులు ప్రయాణిస్తుంటారు. ఈ ఘటన సమయంలో కూడా దాదాపు 100 మందికి పైగా రైల్లో ఉన్నట్లు సమాచారం. బ్రేకులు ఫెయిల్ అయినప్పటికీ రైలు మార్గంలో ఎక్కడా తీవ్రమైన డౌన్ లేకపోవడంతో ప్రమాదం తీవ్రత తగ్గిందని అధికారులు చెబుతున్నారు. రైలు వెనక్కి జారి కొంత దూరం వెళ్లి ఆగిపోవడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లైంది.
ఈ ఘటన ఓవర్‌లోడ్ కారణంగా జరిగిందా లేక ఏదైనా సాంకేతిక లోపం కారణమా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. గత వారం రోజులుగా విశాఖకు పర్యాటకుల రద్దీ భారీగా పెరిగింది. వీకెండ్‌తో పాటు వరుస సెలవులు రావడంతో కైలాసగిరికి పెద్ద ఎత్తున సందర్శకులు తరలివస్తున్నారు. అదే సమయంలో టాయ్ రైలులో సాధారణం కంటే ఎక్కువ మంది ప్రయాణించడం వల్లే ఈ సమస్య వచ్చి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే జీవీఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. టాయ్ రైలు నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై ఆరా తీశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా తాత్కాలికంగా టాయ్ రైలు సేవలను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. పూర్తి స్థాయిలో సాంకేతిక పరిశీలన పూర్తి చేసి, అన్ని భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే మళ్లీ రైలును ప్రారంభించాలని నిర్ణయించారు. పర్యాటకుల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని జీవీఎంసీ అధికారులు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా కైలాసగిరిపై ఈ నెలలోనే ప్రారంభమైన గ్లాస్ బ్రిడ్జి కూడా పర్యాటకులను భారీగా ఆకర్షిస్తోంది. సుమారు రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గాజు వంతెన దేశంలోనే పొడవైన గ్లాస్ బ్రిడ్జిగా గుర్తింపు పొందింది. సముద్ర మట్టానికి సుమారు 1020 అడుగుల ఎత్తులో ఈ వంతెన ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఒకేసారి 100 మంది వరకు వెళ్లే సామర్థ్యం ఉన్నప్పటికీ, భద్రతా కారణాలతో ప్రస్తుతం 40 మందికే అనుమతి ఇస్తున్నారు. 40 ఎంఎం మందం ఉన్న ప్రత్యేక గాజుతో నిర్మించిన ఈ వంతెనపై నిలబడి సాగర తీర అందాలు, విశాఖ నగర దృశ్యాలను వీక్షించవచ్చు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు గ్లాస్ బ్రిడ్జిని సందర్శించేందుకు అవకాశం కల్పించారు. ఒక్కొక్కరికి ప్రవేశ రుసుము రూ.300గా నిర్ణయించారు. ఒక్కోసారి 10 నిమిషాల పాటు వంతెనపై ఉండేలా అనుమతి ఇస్తున్నారు. గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం తర్వాత కైలాసగిరికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో టాయ్ రైలు ఘటన జరగడంతో భద్రతా అంశాలపై మరింత చర్చ జరుగుతోంది.





