ఆంధ్ర ప్రదేశ్

పవన్‌ను వెంటాడుతున్న సుగాలి ప్రీతి కేసు.. అసలు ఏం జరిగింది?

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- సుగాలి ప్రీతి.. టెన్త్‌ క్లాస్‌ విద్యార్థిని. ఎనిమిదేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. హాస్టల్‌ గదిలో ఉరికొయ్యకు వేలాడింది. అత్యాచారం చేసి హత్య చేశారని పేరంట్స్‌ ఆరోపిస్తున్నారు. అధికారంలోకి రాకముందు.. ఆమె కుటుంబానికి న్యాయం చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ హామీ ఇచ్చారు. కానీ.. ఇంత వరకు ఆ కేసు గురించి పట్టించుకోలేదని సుగాలి తల్లి ఆరోపిస్తోంది. అధికారంలోకి రాగానే.. తన కూతురి కేసుపై దృష్టి పెడతానన్న పవన్‌ కళ్యాణ్‌ పట్టించుకోలేదని ప్రెస్‌మీట్‌ పెట్టి కన్నీరుమున్నీరైంది. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసింది సుగాలి తల్లి. ఇంతకీ సుగాలి ప్రీతి ఎలా చనిపోయింది..? ఆత్మహత్య చేసుకుందా..? హత్య చేశారా..? అనేది ఇప్పటికీ తేలలేదు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన పవన్‌ కళ్యాణ్‌ను నిలదీస్తున్నారు తల్లిదండ్రులు. దీంతో… పవన్‌తోపాటు జనసేన కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

Read also : యూరియా అడిగితేనే కొట్టేస్తారా?.. పోలీస్ పై ఆగ్రహించిన రైతన్నలు!

కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో టెన్త్‌ క్లాస్‌ చదువుతున్న సుగాలి ప్రీతి… 2017, ఆగస్టు-19న.. హాస్టల్‌ గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. 8ఏళ్లు గడిచినా ఈ కేసు మిస్టరీ వీడలేదు. అధికార పార్టీపై సుగాలి తల్లి చేసిన విమర్శలతో… ఈ కేసు ఇప్పుడు రాజకీయంగానూ దుమారం రేపుతోంది. సుగాలి ప్రీతి తల్లి పార్వతి దివ్యాంగురాలు. ఆగస్టు-19న తన కూతురు చనిపోయి 8ఏళ్లు పూర్తయిన సందర్భంగా కూతురి సమాధి నుంచి అమరావతి వరకు వీల్‌చైర్‌లోనే యాత్ర తలపెట్టారు. కానీ… పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. ఇపుడు ఈ కేసు కోర్టులో ఉంది.

Read also : రుషికొండ ప్యాలెస్… పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

ఇదిలా ఉంటే… పవన్‌ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు ప్రీతి తల్లి పార్వతి. 2024 ఎన్నికల ముందు జనసేన అధ్యక్షుడు పవన్‌ను కలిసి బాధ చెప్పుకోగా… న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని అంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం సుగాలి ప్రీతి ఫైల్‌పైనే అని చెప్పారని… కానీ, ఇప్పటి వరకు ఆ విషయం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి, పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి 14నెలలు గడిపోయాయి.. అయితే, తన కూతురి కేసు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. ఈ విషయంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి… సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు సుగాలి ప్రీతి తల్లి. జనసేన ఆఫీసు ముందు ఆమరణ దీక్ష చేస్తామని హెచ్చరించారు కూడా.

సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆరోపణలపై పవన్‌ కళ్యాణ్‌తోపాటు జనసేన నేతలు స్పందించారు. 8ఏళ్లు గడిచిపోవడం వల్ల.. క్లూస్‌ దెబ్బతిన్నాయని అంటున్నారు. అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతి కేసును హోంమంత్రి, డీజీపీ దృష్టికి తీసుకెళ్లామన్నారు పవన్‌ కళ్యాణ్‌. సీఐడీ అధికారులు కూడా విచారణ జరిపారని.. కానీ, అనుమానితుల డీఎన్‌ఏ సరిపోలడంలేదన్నారు. ఇందతా వైసీపీ వల్లే అంటూ నెపం జగన్‌ పార్టీపై నెట్టేశారు పవన్‌. గత ఐదేళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల… సాక్ష్యాలను తారుమారు చేశారని, క్లూస్‌ మిస్సయ్యాయని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే.. కేసు విచారణ ముందుకు సాగడంలేదన్నారు పవన్‌ కళ్యాణ్‌. ఈ కేసులో న్యాయం జరగాలని తాను కూడా కోరుకుంటున్నానని చెప్పారాయన. అంతేకాదు.. చేయూత ఇచ్చేవారినే తిడితే ఎలా అంటూ.. ప్రశ్నించారు కూడా. జనసేన నేతలు ఒక అడుగు ముందుకేసి… సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా నిలిచామంటున్నారు. ఆమె తల్లిదండ్రులకు రెవెన్యూలో ఉద్యోగాలు రావడానికి కారణం పవన్‌ కళ్యాణే అని చెప్తున్నారు. అంతేకాదు.. వారికి ఐదు ఎకరాలు భూమి, 5 సెంట్ల ఇంటి స్థలం కూడా ఇచ్చామన్నారు. ఇంత చేసినా.. జనసేనపై, పవన్‌ కళ్యాణ్‌పై విమర్శలు చేయడం తగదంటున్నారు ఆ పార్టీ నేతలు.

Read also : టాలీవుడ్ లో విషాదం.. అల్లు రామలింగయ్య భార్య మృతి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button