
-
స్పందించి ములాఖత్ కు హైదరాబాద్..
-
న్యాయం జరిగే వరకు ప్రాజెక్టు పనులు సాగనివ్వం– భూ నిర్వాసితుల ఆవేదన.
మర్రిగూడ (క్రైమ్ మిర్రర్):- తమ త్యాగాలతో నిర్మిస్తున్న శివన్నగూడెం ప్రాజెక్టు పనులు, తమ బతుకుల్లో వెలుగులు నింపడం లేదని భూ నిర్వాసితులు మరోసారి రోడ్డుపైకి వచ్చారు. ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు మారుతున్నా.. తమ తలరాతలు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రాజెక్టు నిర్మాణం పనులను అడ్డుకున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఒక్క అడుగు కూడా, ముందుకు పడనివ్వబోమని వారు స్పష్టం చేశారు.
ప్రాజెక్టు పనులను నిర్వాసితులు అడ్డుకోవడంతో, క్షేత్రస్థాయిలో ఉద్రిక్తత నెలకొంది. పనులు నిలిచిపోవడంతో నష్టపోతున్న కాంట్రాక్టర్లు, నిర్వాసితులతో చర్చలు జరిపి వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే, “మాటలు వద్దు.. చేతలే ముద్దు” అంటూ నిర్వాసితులు కాంట్రాక్టర్ల ప్రతిపాదనలను తిరస్కరించారు. అధికారులు నేరుగా వచ్చి హామీ ఇచ్చే వరకు, పనులను ప్రారంభించనిచ్చేది లేదని భీష్మించుక కూర్చున్నారు.
నేడు హైదరాబాద్‌కు పయనం : స్థానికంగా సమస్య పరిష్కారం కాకపోవడంతో, నిర్వాసితులు తమ పోరాటాన్ని రాజధాని వైపు మళ్లించారు. నేడు భారీ సంఖ్యలో నిర్వాసితులు హైదరాబాద్‌కు పయనమయ్యారు. సమస్యను పరిష్కరించగల ఉన్నతాధికారులు లేదా సంబంధిత మంత్రుల వద్దే తమగోడు వెళ్లబోసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. తమకు స్పష్టమైన హామీ లభించే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వారు హెచ్చరిస్తున్నారు.
భూ నిర్వాసితుల ప్రధాన డిమాండ్లు ఇవే : 32 మందికి వెంటనే ప్లాట్లు కేటాయించాలి, 289 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలి. నిర్వాసితులందరికీ ప్రభుత్వమే ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లు కట్టివ్వాలి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందేలా చూడాలి, ఖాళీ స్థలాలకు పరిహారంతో పాటు, ఒక్కో ఇంటికి అయిదు లక్షల అదనపు పరిహారం అందించాలి, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. రిజర్వాయర్‌లో చేపల వేట (ఫిషింగ్) హక్కులతో పాటు, ప్రాజెక్టులో వచ్చే ఉద్యోగాల్లో నిర్వాసితులకే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమా : ఏళ్ల తరబడి సాగుతున్న ఈ పోరాటం వెనుక, అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించకుండా, పనులను ముందుకు తీసుకెళ్లాలని చూడటం వల్లే, ఈ పరిస్థితి తలెత్తిందని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాలు మారినా నిర్వాసితుల గోడు, వినే నాథుడే కరువయ్యారని బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు శివన్నగూడెం ప్రాజెక్టు వద్ద నిరసనలు కొనసాగుతాయని, చావో రేవో తేల్చుకుంటామని నిర్వాసితులు స్పష్టం చేశారు. ఇకనైనా భూనిర్వాసితులకు న్యాయం చెయ్యాలని ప్రతిపక్షాలు సైతం కోరుతున్నారు. గూడు వదిలిన ఆ గ్రామాలకు ప్రభుత్వమే, అండగా నిలబడాలని కోరుతున్నారు.





