
శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. సాధారణంగా వీధి కుక్కలు లేదా పిచ్చి కుక్కలు చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులను కరిచిన ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ కుక్క కాకుండా ఒక మనిషే మరో మనిషిని కుక్కలా కొరికిన ఘటన అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఈ ఘటన మానవ సంబంధాల పతనం, నియంత్రణలేని కోపం ఎంతటి భయానక పరిణామాలకు దారితీస్తుందో స్పష్టంగా చూపిస్తోంది.
శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ మండలం వంకర కుంట గ్రామానికి చెందిన పోతుల కుళ్లాయప్ప అనే వ్యక్తి తన ఇంట్లో ఒక పెంపుడు కుక్కను పెంచుకుంటున్నాడు. అదే గ్రామంలో ఎదురింట్లో నివసిస్తున్న గోపాల్ అనే వ్యక్తికి ఆ కుక్క కారణంగా ఇబ్బందులు మొదలయ్యాయి. పెంపుడు కుక్క తరచూ తమ ఇంట్లోకి వచ్చి చెప్పులు కొరుకుతుందని, చిన్నపిల్లలపై దాడి చేస్తోందని గోపాల్ కుళ్లాయప్పను ప్రశ్నించాడు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించాల్సిన సమయంలో, ఈ మాటలు కుళ్లాయప్పకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి.
నా కుక్కనే తప్పుపడతావా అంటూ గోపాల్‌తో కుళ్లాయప్ప తీవ్ర వాగ్వాదానికి దిగాడు. మాటల తగాదా కాస్తా క్షణాల్లోనే హింసాత్మక ఘర్షణగా మారిపోయింది. సాధారణంగా యజమానిపై ఎవరైనా దాడి చేస్తే పెంపుడు కుక్క యజమానిని కాపాడేలా దాడి చేస్తుందని వినిపిస్తుంది. కానీ ఇక్కడ పూర్తి భిన్నంగా జరిగింది. తన పెంపుడు కుక్క గురించి మాట్లాడినందుకే కుళ్లాయప్ప స్వయంగా గోపాల్‌పై దాడి చేశాడు.
ఈ దాడిలో కుళ్లాయప్ప చేసిన పని విన్నవాళ్లను గడగడలాడిస్తోంది. కుక్క పీకినట్లే నోటితో గోపాల్ మర్మాంగం, వృషణాలపై నేరుగా కొరికాడు. ఇది చూసి అక్కడున్నవారు షాక్‌కు గురయ్యారు. ఇంతటితో ఆగకుండా, ఈ అమానుష దాడి జరుగుతున్న సమయంలో కుళ్లాయప్ప తండ్రి పోతులయ్య గోపాల్ కదలకుండా అతడి కాళ్లను పట్టుకున్నాడన్న ఆరోపణలు మరింత సంచలనం రేపుతున్నాయి. తండ్రి కుమారుడికి సహకరించినట్లు వచ్చిన సమాచారం ఈ ఘటనను మరింత భయంకరంగా మారుస్తోంది.
ఈ దాడిలో గోపాల్ మర్మాంగం, వృషణాల వద్ద తీవ్ర గాయాలు కాగా, చర్మం ఊడిపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న గోపాల్‌ను వెంటనే కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి, మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు రిఫర్ చేశారు. ప్రస్తుతం గోపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనపై బాధితుడు గోపాల్ కుమారుడు నల్లమడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు కుక్క యజమాని కుళ్లాయప్పను అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో తండ్రి పాత్రపై కూడా విచారణ చేపట్టినట్లు సమాచారం. గ్రామంలో ఎప్పుడూ చూడని విధంగా చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఒక చిన్న మాటల వివాదం ఇంతటి దారుణానికి దారితీయడం గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది. కుక్కల దాడుల గురించి విన్నాం కానీ.. మనిషే మనిషిని కుక్కలా కొరికిన ఘటన ఎక్కడా చూడలేదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోతే ఎంతటి నష్టం జరుగుతుందో ఈ సంఘటన స్పష్టంగా తెలియజేస్తోంది.
ALSO READ: (VIDEO): వింత ఆచారం.. పెళ్లిలో మామ ఒడిలో కోడలిని కూర్చోబెట్టిన బంధువులు





