
నల్లగొండ, జూలై 19 (క్రైమ్ మిర్రర్): మండల అభివృద్ధికి మార్గదర్శిగా ఉండాల్సిన ఎంపీడీవో కార్యాలయం, నేడు ఓ చెరువు కింద మునిగిపోతుంది. కాసిన్ని చినుకులు పడితే చాలు కార్యాలయం ప్రాంగణం నీటితో నిండిపోతూ, ప్రజలకు నిజమైన యాతనను మిగులుస్తోంది. ఇంత నిర్లక్ష్యం, ఇంత అమానవీయంగా ఉండే పరిస్థితిని చూసి, ప్రజలు ఒక్కటే అంటున్నారు “ఇదే అధికార పాలనా?”
ప్రజల అవసరాలకు కేంద్రబిందువుగా ఉండాల్సిన కార్యాలయం ముందు ఒక్క వర్షానికే నీటిమడుగులు, బురదగుంతలు.. అది కూడా రోజు జనసంచారం ఉన్న ప్రాంతంలో. చెప్పులు చేత పట్టుకొని, మట్టిలో నడిచి, ఫైళ్లను తడవకుండా పట్టుకొని లోపలికి వెళ్తున్న ప్రజలను చూస్తే అధికార యంత్రాంగానికి పౌరుల పట్ల ఉన్న గౌరవం ఏమిటో స్పష్టమవుతోంది.
ఈ కార్యాలయంలో అధికారుల మనస్తత్వం, చలనం లేని పని తీరే ఇందుకు కారణమని స్థానికులు మండిపడుతున్నారు. “నెలాఖరున జీతం రావాలనుకుంటే చాలు, ప్రజల సమస్యలే వారికి అప్రయోజనమైనవే” అంటూ మండిపడుతున్నారు. అధికారుల నిస్సహాయతపై ప్రజలు గుసగుసలకే పరిమితమవుతుండటం విషాదకరం. అంతే కాదు, కార్యాలయం పక్కనే మట్టిపోసి చిన్నచిన్న డ్రైనేజ్ మార్గాలు వేసినా ఈ దుస్థితి దూరమయ్యేది. కానీ చేయాల్సిన పనిని చేయకూడదనే బాధ్యతగా తీసుకుంటున్న అధికారుల మౌనమే దీనికి నిదర్శనం. “చెరువుల్లో చేపలు పట్టాలంటే వలలుంటాయి, కానీ ఈ చెరువులాంటి కార్యాలయంలో అధికారులు మాత్రం చేతులెత్తేస్తున్నారు” అంటూ ప్రజలు విసుకుతున్నారు.
వృద్ధులు, వికలాంగులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో వారికి పట్టించుకోవడం లేదు. ఇది తాత్కాలిక సమస్య కాదు, ప్రతీ వర్షాకాలంలో పునరావృతమవుతున్న గండం. అయినా స్పందన శూన్యం.
ప్రశ్నించాలి… ఈ విధంగా కార్యాలయ ప్రాంగణమే ఈ స్థితిలో ఉంటే, మిగతా అభివృద్ధి పనులు ఎలా నడుస్తాయో? ప్రజల సమస్యలపై స్పందించని సిబ్బందితో గ్రామాల అభివృద్ధి సాధ్యమేనా? ఈ విషయాన్ని తక్షణమే జిల్లా కలెక్టర్, నియోజకవర్గ ఎమ్మెల్యే సీరియస్‌గా తీసుకొని పరిశీలించి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మట్టిపోసి, నీటి నిల్వను నివారించడం మాత్రమే కాదు, ప్రజల పట్ల గౌరవంతో వివరించడమే అవసరం. లేకపోతే, ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల నమ్మకం పూర్తిగా పోయే ప్రమాదం ఉంది.