
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో చోటుచేసుకున్న ఓ కుటుంబ కలహ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. భార్య చెల్లెలైన మరదలతో కలిసి ఓ వ్యక్తి పరారైన ఘటన వెలుగులోకి రావడంతో బాధిత కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. చిన్న కూతురు ఒక్కసారిగా కనిపించకపోవడంతో ఆమె తండ్రి గుండెల్లో గుబులు మొదలైంది. అన్ని చోట్ల వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఒక కుటుంబానికి చెందిన పెద్ద కుమార్తెను కోర్టులో వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం అతడు తరచూ భార్య పుట్టింటికి వెళ్లివచ్చేవాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఉండే చిన్న కుమార్తెతో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా చనువుగా మారినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానం లేకుండా వ్యవహరించగా, అదే నమ్మకం ఇప్పుడు వారికి శోకంగా మారింది.
ఇటీవల మామ పనిమీద బయటకు వెళ్లిన సమయంలో అల్లుడు ఆ ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో భార్య చెల్లెలైన చిన్న కుమార్తెతో కలిసి అక్కడి నుంచి పరారయ్యాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన తండ్రి తన చిన్న కూతురు కనిపించకపోవడంతో తీవ్రంగా ఆందోళన చెందాడు. బంధువుల ఇళ్లలో, పరిసర గ్రామాల్లో వెతికినా ఆమె జాడ దొరకలేదు. అదే సమయంలో అల్లుడు కూడా కనిపించకపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.
తన చిన్న కుమార్తెను అల్లుడే తీసుకెళ్లి ఉంటాడని భావించిన తండ్రి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారైన వ్యక్తి, యువతిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఫోన్ కాల్ డీటెయిల్స్, పరిచయాల ఆధారంగా వారి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ALSO READ: ALERT: మరో 3 రోజులు.. పదేళ్ల రికార్డ్ బ్రేక్





