
చెన్నూరు మండలంలో వెలుగుచూసిన ఓ ఘటన సమాజాన్ని కలచివేసేలా మారింది. నిరుపేద కుటుంబానికి చెందిన మైనర్ బాలికపై ప్రభుత్వ బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి లైంగిక దాడికి పాల్పడటం తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. దీనికన్నా దారుణమేమంటే.. ఈ ఘోరానికి చట్టపరమైన శిక్ష పడకుండా డబ్బుతో నోరు నొక్కే ప్రయత్నం జరగడం. అధికార యంత్రాంగం, స్థానిక పెద్దమనుషుల వ్యవహార శైలి సమాజం తలదించుకునే పరిస్థితిని తీసుకొచ్చింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. విధుల నిమిత్తం చెన్నూరు మండలంలోని ఓ గ్రామానికి అతడు తరచూ వెళ్లేవాడు. అదే గ్రామంలో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక నివసిస్తోంది. ఇటీవల ఆమె తండ్రి మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. తండ్రి లేని లోటు, పేదరికం, మానసిక వేదనతో ఉన్న ఆ కుటుంబ పరిస్థితిని అవకాశంగా మలచుకున్న సదరు ప్రభుత్వ ఉద్యోగి బాలికను మాయమాటలతో నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయం క్రమంగా బాలిక బంధువులకు తెలిసింది. బాలిక పరిస్థితిని చూసి వారు పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. కానీ ఇక్కడే వ్యవహారం మలుపు తిరిగింది. నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి కావడంతో కొందరు అధికారులు, స్థానికంగా పలుకుబడి ఉన్న పెద్దమనుషులు రంగంలోకి దిగారు. పోలీస్ స్టేషన్ దాకా వెళ్లకుండా బాలిక కుటుంబాన్ని అడ్డుకుని రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారు.
చట్ట ప్రకారం నిందితుడిపై పోక్సో కేసు నమోదు కావాల్సి ఉండగా, డబ్బుతో వ్యవహారం చల్లార్చే ప్రయత్నం జరిగింది. బాలిక కుటుంబానికి రూ.లక్ష ఇవ్వాలని ఒప్పందం కుదిర్చి, పోలీసులకు ఫిర్యాదు చేయకుండా చూడాలని ప్రయత్నించినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో చట్టాన్ని, న్యాయాన్ని, బాలిక భవిష్యత్తును పూర్తిగా పక్కన పెట్టడం స్థానికంగా తీవ్ర విమర్శలకు దారితీసింది.
ప్రభుత్వ ఉద్యోగి అనే హోదా ఉండి కూడా ఓ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడటం అత్యంత దుర్మార్గమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, నిందితుడిని కాపాడే ప్రయత్నం చేసిన పెద్దమనుషులు, అధికారులు కూడా అంతే బాధ్యులని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి రాజీలు నేరాలను ప్రోత్సహించడమే కాకుండా, బాధితులకు న్యాయం దూరం చేస్తున్నాయని వారు మండిపడుతున్నారు.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాజీకి పాల్పడిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బాలికకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన కేవలం ఒక గ్రామానికి పరిమితం కాకుండా, సమాజంలో జరుగుతున్న అణచివేతలకు అద్దం పడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: చంద్రుడిపై హోటల్.. బుకింగ్స్ స్టార్ట్





