
నల్లగొండ (క్రైమ్ మిర్రర్):- భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వాల వల్లనే నేడు దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా, ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా తన నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగమే మన రక్షణ కవచమన్నారు. భారతదేశం పూర్తిస్థాయిలో ప్రజాపాలన దిశగా అడుగులు వేయడానికి, రాజ్యాంగమే పునాది అని ఆయన కొనియాడారు. ప్రతి సామాన్యుడికి అభివృద్ధి ఫలాలు అందాలనే ఆకాంక్షతో, ఎంతోమంది మేధావులు కష్టపడి, మన రాజ్యాంగాన్ని రూపొందించారని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలోని, అధికరణల వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, ప్రజాస్వామ్య పద్ధతిలో మన హక్కులను మనం సాధించుకున్నామని ఆయన పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వమే లక్ష్యమని, ప్రజలందరూ కుల, మత, వర్గ విభేదాలు లేకుండా స్వేచ్ఛగా, గౌరవంగా జీవించినప్పుడే, గణతంత్ర వేడుకలకు అసలైన సార్థకత లభిస్తుందని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజ్యాంగ బద్ధంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకుంటూనే, బాధ్యతగల పౌరులుగా దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.
Read also : హిందీ చిత్రాలు మూలాలను కోల్పోతున్నాయి.. ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు?
Read also : ఆత్మకూరు(ఎం)లో శ్రీ కనకదుర్గ అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవం





