టెహ్రాన్ పై విరుచుకపడ్డ ఇజ్రాయెల్
టెహ్రాన్, క్రైమ్ మిర్రర్: పశ్చిమాసియలో యుద్దం రోజు రోజుకు తీవ్రతరం అవుతుంది. క్షిపణులుతో శక్తివంతమైన దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయిల్ తెల్లవారు జామున భారీ స్థాయిలో వైమానిక దాడులు చేసింది. టెర్రర్ మౌలిక సదుపాయాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా దాడులు చేశాయి.కాగా హోర్ముజ్ జలసంధి శాశ్వతంగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. పీరూజీ స్ట్రీట్, షాహిద్ బాబాయ్ ఎక్స్‌ప్రెస్‌వే, హాఫెజ్ జంక్షన్ వంటి రద్దీ ప్రాంతాల్లో శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి.
ఈ దాడుల వల్ల పలు ప్రభుత్వ భవనాలు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక చిన్నారి మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. కాగా ఈ దాడులపై ఇజ్రాయెల్ సైన్యం ఐడీఎఫ్ స్పందిస్తూ.. ఇరాన్‌లోని టెర్రర్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ప్రకటించింది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.
హర్మూజ్‌ను మూసి వేస్తాం…ఇరాన్ హెచ్చరిక…
ఈ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ విప్లవ దళాలు ఐఆర్జీసీ ఇప్పటికే ప్రతీకార దాడులు ప్రారంభించినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలతో పాటు, సౌదీ అరేబియాలోని అమెరికా ‘ప్రిన్స్ సుల్తాన్’ ఎయిర్ బేస్‌ను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా గనుక తమ ఇంధన కేంద్రాలపై దాడులు చేస్తే, ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని శాశ్వతంగా మూసివేస్తామని కూడా ఇరాన్ హెచ్చరించింది.
