
సాధారణంగా భూములు విక్రయించాలంటే రైతులు మధ్యవర్తులను ఆశ్రయిస్తారు. కొనుగోలుదారులతో బేరసారాలు జరిపి తమకు నచ్చిన ధరకు భూమిని అమ్ముకుంటారు. కానీ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం సంప్రదాయానికి భిన్నంగా ఆలోచించి తన వ్యవసాయ భూమిని లాటరీ విధానంలో విక్రయించేందుకు ప్రయత్నించి సంచలనంగా మారాడు.
పెనుగంచిప్రోలు మండలానికి చెందిన దేవరశెట్టి రాంబాబుకు సుమారు 95 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఎకరం ధర రూ.70 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతోంది. వ్యక్తిగత అవసరాల రీత్యా తన భూమిని విక్రయించాలని నిర్ణయించుకున్న రాంబాబు.. అందరికీ భిన్నంగా లాటరీ పద్ధతిని ఎంచుకున్నారు.
భూమిని నేరుగా అమ్మే బదులు టోకెన్లు విక్రయించి డ్రా నిర్వహించి గెలుపొందిన వ్యక్తికి భూమి రిజిస్ట్రేషన్ చేయాలన్నదే ఆయన ఆలోచన. ఈ ప్రణాళికకు ప్రచారం అవసరమని భావించిన రాంబాబు సోషల్ మీడియా యాడ్స్ నిపుణులను రంగంలోకి దింపారు. తిరుపతమ్మ ఆలయం నుంచి పొలం వరకు రహదారులను, పొలాన్ని డ్రోన్‌లతో అందంగా చిత్రీకరించి, యాంకర్ వాయిస్ ఓవర్‌తో ఆకర్షణీయ ప్రోమోలు రూపొందించారు.
ఈ ప్రోమోలను యూట్యూబ్, వాట్సాప్ గ్రూపులు, ఇతర సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయడంతో విషయం వేగంగా వైరల్ అయింది. దీంతో అనేక మంది టోకెన్లు కొనుగోలు చేయడానికి ముందుకొచ్చారు.
ఒక్కో టోకెన్ ధరను రూ.500గా నిర్ణయించారు. మొత్తం 30 వేల టోకెన్లను ఆన్‌లైన్ ద్వారా విక్రయించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్లారు. ఇందుకోసం సుమారు 500 మంది ఏజెంట్లను నియమించారు. ప్రతి టోకెన్ విక్రయంపై ఏజెంట్‌కు రూ.100 కమీషన్ ఇచ్చేలా వ్యవస్థ రూపొందించారు. పెద్ద మొత్తంలో టోకెన్లు విక్రయించిన వారికి ప్రత్యేక రాయితీలు కూడా ప్రకటించారు.
ఈ లాటరీ స్కీమ్‌కు స్పందన ఊహించిన దానికంటే ఎక్కువగానే వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఇప్పటి వరకు సుమారు 3,800 టోకెన్లు విక్రయమైనట్లు సమాచారం. సంక్రాంతి రోజున డ్రా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు.
అయితే ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లడంతో పరిస్థితి మారిపోయింది. లాటరీ విధానంలో భూమి విక్రయించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ పోలీసులు జోక్యం చేసుకున్నారు. వెంటనే టోకెన్ల విక్రయాలు నిలిపివేయాలని స్పష్టం చేశారు.
పోలీసుల ఆదేశాలతో రైతు రాంబాబు ఇప్పటికే టోకెన్లు కొనుగోలు చేసిన వారికి నగదు తిరిగి చెల్లించే ప్రక్రియ ప్రారంభించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు రైతు వినూత్న ఆలోచనపై ప్రశంసలు వ్యక్తమవుతుండగా, మరోవైపు చట్టపరమైన సమస్యలపై చర్చ కొనసాగుతోంది.
ALSO READ: వివాహానికి ముందు జంటలు ఏ వైద్య పరీక్షలు చేయించుకోవాలి?





