
మునుగోడు,క్రైమ్ మిర్రర్ :- జీవన పద్ధతులతో తెగుళ్లు పురుగులు నివారించవచ్చు అని మండల వ్యవసాయాధికారి పద్మజ అన్నారు. మునుగోడు గ్రామ పంచాయతీలోని రామకృష్ణాపురంలో బీసం నాగమ్మ మరియు ఈద వెంకన్నల వరి పొలాల ను సందర్శించి,వరిలో వేరు కుళ్ళు మరియు కాండం కుళ్ళు తెగుళ్లను గమనించడం జరిగిందనీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూరియా వంటి నత్రజని ఎరువులను అధికంగా వాడడం వలన పురుగులు, తెగుళ్లు ఉధృతి పెరుగుతుందనీ,కలుపు మందులు కూడా మోతాదుకు మించి వాడడం వలన పంటలకు నష్టం కలుగుతుందనీ తెలిపారు.అధికంగా మోతాదుకు మించి ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తెగుళ్ళ నివారణ కోసం ముందుగా పొలంలోని నీటిని తీసివేసి పగుళ్లు వచ్చే వరకు ఆరబెట్టుకుని మరల నీరు పెట్టుకోవాలి. పొలాలలో ఎక్కువ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఉండడం వల్ల వేర్లకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల వేరులు కుళ్ళిపోతుంటాయి.నీరు తీసేసి పగుళ్లు వచ్చే వరకు ఆరబెట్టి మరల నీళ్లు పెట్టుకోవడం వల్ల మొక్కల వేర్లకి ఆక్సిజన్ బాగా అందుతుందనీ,ఇలా చేయడం వలన వరి పొలాలు చలిని కూడా తట్టుకోగలుగుతాయి.ఈ శిలీంద్రాల నివారణ కోసం అజాక్సిస్ట్రోబిన్ మరియు డైఫేనోకొనజోల్ కాంబినేషన్ మందు లేదా సాఫ్ లేదా ప్రాఫికొనజోల్ లేదా టేబ్యుకొనజోల్ లేదా ట్రయాడి మెఫాన్ లేదా మాoకో జెబ్ లేదా కార్బండ జిమ్ వంటి శిలీంద్ర నాశనులను ఉపయోగించి నివారించుకోవచ్చు అన్నారు.ఆవు పేడ 10 కిలోలు, ఆవు మూత్రము 10 లీటర్ల, శెనగపిండి 2 కిలోలు, బెల్లం 2 కిలోలు, పుట్టమన్ను పిడికెడు తీసుకొని వాటిని 200 లీటర్ల డ్రమ్ములో వేసి డ్రమ్మును నీటితో నింపి రోజు కలియబెడుతూ ఉంటే జీవామృతం ఒక వారం రోజులకు తయారవుతుంది.ఈ జీవామృతం తయారు చేసుకొని ఉపయోగించడం వలన భూమిలో సారం పెరగడమే కాకుండా మొక్కకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వరిలో కాలిబాటలు రెండు మీటర్లకు ఒక అడుగు చొప్పున తీసుకోవడం వలన మొక్కలకు గాలి వెలుతురు సరిగా అంది చీడపీడల ఉధృతి తగ్గుతుందనీ వివరించారు. ఈ కార్యక్రమంలో చెనగోని రవీందర్, రాణి, శ్రీను రైతులు పాల్గొన్నారు.
Read also : Koti ATM Robbery: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. ఏటీఎం దగ్గర స్పాట్ పెట్టి..
Read also : Red Hair Controversy: జుట్టుకు ఎర్ర రంగు వేసిన పోలీస్ ఆఫీసర్.. సీన్ కట్ చేస్తే సస్పెన్షన్ వేటు!





