జాతీయం

గడియారం టిక్ ఆగిపోయింది.. రతన్ టాటాకు ప్రముఖుల కన్నీటి నివాళి

రతన్ టాటా దూరదృష్టి గల వ్యాపార నాయకుడు, దయగల వ్యక్తిత్వం, అసాధారణమైన వ్యక్తి అని కొనియాడారు ప్రధాని మోదీ. భారతదేశంలోని పురాతన, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారన్నారు. రతన్‌ టాటా వినయం, దయ, మన సమాజాన్ని మెరుగుపరచాలనే అచంచలమైన నిబద్ధతకు కృతజ్ఞతలు తెలిపారు.. అలాగే తాను గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలోనూ రతన్ టాటాను కలిసిన సందర్భాలను ఆయన గుర్తు చేసుకున్నారు.

రతన్ టాటా మాదిరి దార్శనికత, చిత్తశుద్ధితో ఈ ప్రపంచంపై చిరస్థాయి ముద్ర వేసిన వారు చాలా త‌క్కువ మంది ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు. ఈ రోజు మనం కేవలం ఒక వ్యాపార టైకూన్‌నే కాదు, నిజమైన మానవతావాదిని కోల్పోయామన్నారు. నిన్ను చాలా మిస్ అవుతాను ఫ్రెండ్‌ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. భారతదేశపు గొప్ప పారిశ్రామికవేత్తలలో ఒకరైన రతన్ టాటా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతదేశ కార్పొరేట్ ప్రపంచంలో దూరదృష్టి గల నాయకుడు, మానవతావాది అన్నారు. టాటా జీవితం వినయం, విజయంతో కూడిన అసాధారణ ప్రయాణమని కొనియాడారు.

రతన్ టాటా లేరన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే. టాటా చేస్తున్న పనుల ద్వారా అనేకమంది ప్రేరణ పొందారన్న ఆయన.. రతన్ టాటాను అరుదైన రత్నంతో పోల్చారు. దేశం అరుదైన రత్నం వంటి వ్యక్తిని కోల్పోయిందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆయనొక లెజెండ్ అని, మానసిక దృఢత్వంతో టాటా గ్రూప్ ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లారని కొనియాడారు. ప్రభుత్వ లాంఛనాలతో టాటా అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించారు.

రతన్ టాటా లేకపోవడాన్ని తాను అంగీకరించలేనని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎక్స్‌లో పేర్కొన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ చారిత్రాత్మక పురోగతికి చేరువలో ఉందన్నారు. మనం ఉన్న చోటికి రతన్ జీవితం, పని చాలా పెద్ద సహకారం అందించిందని… అందువల్ల, ఈ సమయంలో ఆయన మార్గదర్శకత్వం మరింత అమూల్యమైందని పేర్కొన్నారు. ఆయన పోయిన తర్వాత, మనం చేయగలిగేదల్లా ఆయన చూపిన మార్గాన్ని అనుసరించడమేనని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.

గడియారం టిక్ చేయడం ఆగిపోయింది. రతన్ టాటా సమగ్రత, నైతిక నాయకత్వం, దాతృత్వానికి ఒక వెలుగు వెలిగారని గుర్తు చేశారు పారిశ్రామిక వేత్త హర్షా గోయెంకా. ఆయన వ్యాపార, వెలుపలి ప్రపంచంలో చెరగని ముద్ర వేశారని… ఆయన మన జ్ఞాపకాలలో ఎప్పటికీ చిర‌స్మర‌ణీయంగానే ఉంటారంటూ సంతాపం వ్యక్తం చేశారు.

పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా ఇక లేరన్న వార్త సినీలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక శకం ముగిసిందంటూ తమ సంతాపం వ్యక్తం చేశారు. సేవలో రతన్‌ టాటాను మించినవారు లేరని… మనదేశం ఇప్పటి వరకు చూసిన గొప్ప దార్శనికుల్లో టాటా ఒకరని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మెగా ఐకాన్‌. నిజమైన పారిశ్రామిక వేత్త, పరోపకారి… అసాధారణ మానవుడు… అని కొనియాడారు. టాటా బ్రాండ్‌లను గ్లోబల్‌ పవర్‌ హౌస్‌గా నిర్మించడమే కాకుండా.. మనదేశ నిర్మాణంలోనూ అద్భుతంగా కృషి చేశారన్నారు.

రతన్‌టాటా మన హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారన్నారు దర్శకుడు రాజమౌళి. టాటా ఉత్పత్తులను ఉపయోగించని రోజును ఊహించుకోవడం కష్టమన్నారు. ఆయన ఎన్నోతరాలకు స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. పంచ భూతాలతో పాటు ఆయన కూడా ఎప్పటికీ మనతోనే ఉంటారని పేర్కొన్నారు రాజమౌళి.

రతన్‌ టాటాది బంగారంలాంటి హృదయమన్నారు జూనియర్ ఎన్టీఆర్. భారతదేశం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు దూరదృష్టి గల వ్యక్తి… ఎంతోమంది జీవితాలను మార్చేసిన ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు ఎక్స్‌ వేదికగా ఎన్టీఆర్‌ పోస్ట్ పెట్టారు. ఒక పరోపకారి. లక్షలాది మందికి ఆశాజ్యోతి రతన్‌ టాటా అని కొనియాడారు నటి ఖుష్బూ. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచి… నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎంతో కృషి చేశారన్నారు. ఆయన ఇక లేరని ప్రపంచం కన్నీళ్లు పెట్టుకుంటోందన్నారు.

ర‌త‌న్ టాటా మృతితో యావత్ భారతదేశం శోకసంద్రంలో మునిగిపోయింది. దాతృత్వంతో పాటు వివిధ రంగాలలో ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ ఒలింపిక్‌ పతక విజేత నీరజ్ చోప్రా, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌ సహా ఇత‌ర క్రీడాకారులు రతన్ టాటాకు సోష‌ల్ మీడియా ద్వారా నివాళులు అర్పించారు.

Back to top button