మన ముఖంలో చిన్నదిగా కనిపిస్తుంది కానీ.. ప్రత్యేకమైన నిర్మాణం కలిగిన భాగాల్లో ఒకటి ఫిల్ట్రమ్. ముక్కు కింద, పై పెదవి పైన కనిపించే ఈ నిలువు గీతలాంటి భాగాన్ని ఇంగ్లీష్‌లో ఫిల్ట్రమ్ అని అంటారు. ఇది ప్రతి వ్యక్తిలో కొంచెం భిన్నంగా ఉంటుంది. కొందరిలో ఇది లోతుగా కనిపిస్తే, మరికొందరిలో తక్కువగా కనిపిస్తుంది. అందానికి సంబంధించి కూడా కొందరు ఈ భాగాన్ని ఒక ప్రమాణంగా పరిగణిస్తారు.
శాస్త్రీయంగా చూస్తే.. ఫిల్ట్రమ్ ఆకారం, పొడవు, వెడల్పు అన్నీ కూడా జన్యుపరమైన లక్షణాలపై ఆధారపడి ఉంటాయి. అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిన లక్షణాల వల్లే ఇది ఎలా ఉంటుందో నిర్ణయించబడుతుంది. కొన్ని సందర్భాల్లో ఫిల్ట్రమ్ అసాధారణంగా లోతుగా లేదా చాలా పొడవుగా ఉంటే, అది కొన్ని అరుదైన జన్యుపరమైన సమస్యల సూచనగా కూడా భావిస్తారు. అయితే సాధారణంగా ఇది ఆరోగ్య సమస్య కాదు.
ఈ ఫిల్ట్రమ్ ప్రాంతం ఎందుకు లోతుగా ఉంటుందో అనేది చాలా మందికి ఆసక్తికరంగా ఉంటుంది. ఈ భాగంలో చర్మం కొంచెం మడత పడినట్టుగా ఉండటం వల్ల, మనం మాట్లాడేటప్పుడు పై పెదవి సులభంగా కదలడానికి సహాయపడుతుంది. నోటి కదలికలు, ముఖ భావ వ్యక్తీకరణల్లో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంటే మనం మాట్లాడటం, నవ్వడం వంటి చర్యలు సులభంగా జరగడానికి ఇది సహాయకారి.
ఇక పెదవుల విషయానికి వస్తే.. మన శరీరంలోని మిగతా చర్మంతో పోలిస్తే పెదవులు కొంచెం భిన్నంగా ఉంటాయి. పెదవుల్లో చెమట గ్రంథులు ఉండవు. అందుకే పెదవులకు చెమట పట్టదు. ఈ కారణంగా వాతావరణ మార్పులు వచ్చినప్పుడు లేదా నీటి కొరత ఉన్నప్పుడు పెదవులు త్వరగా పొడిబారిపోతాయి. అందుకే పెదవులను సంరక్షించుకోవడం కూడా చాలా అవసరం.
ALSO READ: మిడిల్ క్లాస్ టార్గెట్‌గా వస్తున్న EV స్కూటీలు
