
Telangana Rising: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ప్రజాపాలన రెండేళ్ల విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన పెట్టిన సందేశం కేవలం రాజకీయ ప్రకటన కాదు.. ప్రజా ఆకాంక్షలకు ఇచ్చిన గౌరవం, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలన్న తన సంకల్పానికి ప్రతిరూపమైంది. రెండు సంవత్సరాల క్రితం ప్రజలు ఇచ్చిన ఓటు ధైర్యాన్ని, తనను నాయకుడిగా నిలిపిన విశ్వాసాన్ని ఆయన మరోసారి గుర్తుచేసుకున్నారు. ప్రజా ఆశీర్వాదం తమను ముందుకు నడిపే శక్తి అని స్పష్టం చేశారు.
గత పాలనలో స్తబ్ధతకు గురైన వ్యవస్థలను పునర్నిర్మించడమే కాకుండా, తెలంగాణను జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు దక్కేలా చేయడానికి శ్రమించామని పేర్కొన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నప్పుడు, వారికి కొత్త అవకాశాలు అందించగలిగామని చెప్పారు. రుణబాధలతో నలిగిన రైతులకు ఆత్మవిశ్వాసం ఇచ్చే విధానాలు అమలు చేశామని, రైతు సంక్షేమాన్ని ప్రభుత్వ విధానాల కేంద్రంగా పెట్టామని వివరించారు.
ప్రత్యేకంగా ఆడబిడ్డల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు కొత్త దారులు చూపుతున్నాయని చెప్పారు. ఆర్థిక స్వావలంబన, విద్య, భద్రత వంటి అంశాల్లో గణనీయమైన మార్పులు తెచ్చేందుకు ఆడబిడ్డల కోసం ప్రత్యేక పథకాలు అమలులోకి తీసుకువచ్చామని తెలిపారు. ప్రజలు ఎన్నాళ్లుగానో కోరుకున్న కుల లెక్కలు చేపట్టడం, సామాజిక న్యాయాన్ని మరింత బలోపేతం చేసిన నిర్ణయం అని ఆయన పేర్కొన్నారు.
ఈ రెండేళ్లలో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉందని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటి నిర్ణయాలు తెలంగాణ యువతను ప్రపంచ స్థాయి పోటీలో నిలబెట్టే పునాదిగా నిలుస్తాయని వివరించారు.
స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలకు చిహ్నమైన తెలంగాణ భావజాలానికి అధికారిక గుర్తింపు ఇవ్వడం, అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు.
సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, రవాణా సౌకర్యాలు, గ్యాస్ ఉపశమనం, రైతులకు అదనపు బోనస్, ఆడబిడ్డలకు ఆర్థిక భద్రత ఇవన్నీ తెలంగాణ సంక్షేమ పరంపరలో ఓ కొత్త అధ్యాయాన్ని వ్రాసినట్లు చెప్పారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు ఈ విధానాలు ఎంతో దోహదం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
2047 నాటికి తెలంగాణ ఎలా ఉండాలి అన్న దానిపై లోతైన ఆలోచనతో పెద్ద ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రపంచ వేదికపై తెలంగాణ ప్రగతిని ప్రతిధ్వనించేలా ప్రణాళికలు రూపొందించడం, తెలంగానా రైజింగ్ పథకాన్ని ముందుకు తీసుకెళ్లడమే తమ ధ్యేయమని అన్నారు. ప్రపంచానికి తెలంగాణను పరిచయం చేస్తూ కొత్త అవకాశాలను తెచ్చే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత రాష్ట్రం మరో మలుపు తిరుగుతుందని ధైర్యంగా చెప్పారు. ప్రజల ఆశీర్వాదాలు, ప్రేమ, మద్దతు ఎంతవరకు ఉంటాయో, అంతవరకు తన సేవ కొనసాగుతుందని వాగ్దానం చేశారు. తెలంగాణ నాకు తోడుగా ఉన్నంత వరకు.. ఈ గొంతులో ఊపిరి ఉన్నంత వరకు.. “TELANGANA RISING” కు తిరుగు లేదు. అందరికీ ప్రజా పాలన రెండేళ్ల విజయోత్సవ శుభాకాంక్షలు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ALSO READ: IndiGo: రూ.610 కోట్లు రీఫండ్





