* మంత్రి పదవి కోసం సరికొత్త వ్యూహం
* తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో సరికొత్త చర్చ
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి రాజీ కుదుర్చుకున్నారా? ఇద్దరి మధ్య వివాదాలు సమసి పోయాయా? పరస్పరం సహకరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారా? రాజగోపాల్ రెడ్డికి విస్తరణలో మంత్రి పదవి ఖాయమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎప్పుడు రేవంత్ రెడ్డి తో విభేదించే రాజగోపాల్ రెడ్డి ఆయనతోనే ఏకాంత భేటీ జరపడం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డి తో రాజగోపాల్ రెడ్డి రాజీ కుదుర్చుకున్నట్లుగా ప్రచారం నడుస్తోంది. మంత్రి పదవి విషయంలో గతంలో తాను చాలా విమర్శలు చేసి ఉండడంతో.. అవి తనకు మైనస్ కాకుండా ఉండేలా రాజు చేసుకునేందుకు రాజగోపాల్ ప్రయత్నిస్తున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
ఆది నుంచి రేవంత్ పై వ్యతిరేకత..
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికను ఆది నుంచి రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకించేవారు. రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వారి మధ్య సంబంధాలు కూడా అంతంతమాత్రంగానే ఉండేవి. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాజగోపాల్ రెడ్డి ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ఆయన పాల్గొన్న అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండేవారు. ఒక్క దశలో అయితే రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని వ్యక్తిగత ఆరోపణలు కూడా చేసేవారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో విభేదించిన రాజగోపాల్ రెడ్డి తర్వాత బిజెపిలోకి వెళ్లారు. కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ కనిపించడంతో మళ్లీ అదే పార్టీలోకి వచ్చారు. అటు తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి కోసం గొడవ పెట్టుకున్నారు. అప్పటినుంచి సీఎం రేవంత్ రెడ్డితో విభేదిస్తూనే వచ్చారు.
ఎన్నో రకాల ప్రయత్నాలు..
సీఎం రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వాన్ని మార్చేస్తానని.. సీఎం అవుతానని కూడా ప్రకటనలు చేశారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్యంగా సమావేశం అయ్యారన్న ప్రచారం కూడా జరిగింది. పార్టీ కోసం కష్టపడిన సీనియర్లను కాదని.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన బహిరంగ విమర్శలు చేస్తూ వచ్చారు. పాలనాపరంగా కూడా ఆరోపణలు చేశారు. అయితే రాజగోపాల్ రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి కూడా తేలిగ్గా తీసుకునేవారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ పరపతి పెరగడంతో రాజగోపాల్ రెడ్డి పునరాలోచనలో పడ్డారు.
విస్తరణ నేపథ్యంలోనే..
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తలు వస్తున్నాయి. ఒకరిద్దరు మంత్రులను మార్చి కొత్త వారిని తీసుకుంటున్నారు అన్న ప్రచారం కూడా ఉంది. ఇప్పటికే మంత్రివర్గంలో రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఆయన మార్పు ఉంటుందన్న ప్రచారం కూడా ఉంది. ఒకవేళ ఆయనను తొలగిస్తే ఆ స్థానంలో సోదరుడు రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు రాజగోపాల్ రెడ్డి. కానీ గతంలో రేవంత్ విషయంలో చాలా రకాల వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. అవి ఇబ్బందికరంగా మారకుండా ఉండాలని ఇప్పుడు సీఎంతో రాజీ కుదుర్చుకున్నట్లు తెలంగాణ పొలిటికల్ సర్కిల్ చర్చ నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
