Telangana Politics: గులాబీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి ఎప్పుడు ప్రవేశిస్తారన్న ప్రశ్న ప్రస్తుతం పార్టీ శ్రేణుల్లోనే కాదు.. ఆయనను అభిమానించే వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల అనంతరం ఆయన ప్రజల మధ్యకు రావడం తగ్గడంతో పార్టీ కేడర్ లో కొంత నిరీక్షణ వాతావరణం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల ముందు ఫాంహౌస్‌ను వీడి బయటకు వచ్చిన ఆయన మూడు జిల్లాల్లో భారీ సభలు నిర్వహిస్తామని ప్రకటించారు. ముఖ్యంగా కృష్ణా నది ప్రవహించే జిల్లాల్లో సభలు పెట్టి ఆంధ్రప్రదేశ్ చేస్తున్న జల వినియోగ విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. అయితే ఆ ప్రకటన తర్వాత ఆ సభలపై మళ్లీ స్పష్టత రాలేదు. కేటీఆర్, హరీశ్ రావు వంటి కీలక నేతలు కూడా ఆ అంశంపై ఎలాంటి సంకేతాలు ఇవ్వకపోవడం గమనార్హం.
ఇదే సమయంలో కవితకు లిక్కర్ కేసులో క్లీన్ చిట్ రావడం మరోసారి రాజకీయ సమీకరణాలను కదిలిస్తోంది. కొంతకాలంగా తండ్రికి దూరంగా ఉన్న కవిత మళ్లీ దగ్గరవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం వినిపిస్తోంది. మరోవైపు కుటుంబ అంతర్గత విభేదాలు పార్టీకి నష్టాన్ని కలిగిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపించడంతో, ఈ వివాదాలకు ముగింపు పలకాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారనే చర్చ సాగుతోంది. లిక్కర్ కేసులో నిర్దోషిగా తేలిన తర్వాత కవిత రాజకీయంగా మరింత దూకుడు ప్రదర్శించే అవకాశముందనే అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు పార్టీ లోపల చర్చకు దారితీశాయి.
లిక్కర్ కేసు నేపథ్యంలో కవిత బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై బహిరంగ విమర్శలు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర ఉందని వ్యాఖ్యానించారు. దర్యాప్తు సంస్థలు పిలిస్తే హాజరై తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పిస్తానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తన కుటుంబ సభ్యుల ఫోన్ లను గత ప్రభుత్వంలో ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు కూడా ఆమె చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికర పరిస్థితులను తీసుకొచ్చాయి. తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో అన్నాచెల్లెళ్ల మధ్య దూరం మరింత పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి లిక్కర్ కేసు ప్రభావం ఉందని ఆయన చేసిన వ్యాఖ్యపై కవిత తీవ్రంగా స్పందించారు. ఓటమిని తన భుజాలపై మోపవద్దని, అభ్యర్థుల ఎంపికలో లోపాలు, ప్రజా వ్యతిరేకతే కారణమని ఆమె బలంగా ప్రతివాదించారు.
మే నెలలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని, అసలైన ఉద్యమకారులను ప్రోత్సహిస్తానని కవిత చేసిన ప్రకటన రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. బీఆర్ఎస్ నేతలలో కొందరు తనతో టచ్ లో ఉన్నారని చెప్పడం కూడా చర్చకు దారితీసింది. ఆమె పార్టీని బహిరంగంగా లక్ష్యంగా చేసుకోవడం గులాబీ బాస్ కు అసంతృప్తి కలిగించిందనే సమాచారం వినిపిస్తోంది. అయితే లిక్కర్ కేసులో క్లీన్ చిట్ రావడంతో కుటుంబ అంతర్గత విభేదాలను సర్దుబాటు చేసుకుని రాజకీయంగా ఏకమవ్వాలనే ఆలోచన కూడా బలపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
కేసీఆర్ నేరుగా పిలుపునివ్వకపోయినా మధ్యవర్తుల ద్వారా చర్చలు జరిగే అవకాశముందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కవిత మళ్లీ పార్టీలోకి వస్తే ఆమెకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు, హరీశ్ రావు, సంతోష్ రావుల విషయంలో ఏ విధమైన సమన్వయం జరుగుతుంది అన్నదానిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కుటుంబ ఐక్యత పార్టీకి రాజకీయంగా బలాన్ని చేకూర్చవచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కవిత పార్టీపై విమర్శలు చేస్తుండడం ప్రత్యర్థి పార్టీలకు పరోక్ష లాభాన్ని కలిగిస్తోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ భవిష్యత్ నిర్ణయాలు బీఆర్ఎస్ రాజకీయ దిశను నిర్దేశించనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ALSO READ: Telangana: దివ్యాంగులకు మహాలక్ష్మి కానుక.. వారికి కూడా ఉచిత బస్సు ప్రయాణం
