
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : (HCA) హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో చోటుచేసుకున్న అవకతవకలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) రాష్ట్ర క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID)కి ఫిర్యాదు చేసింది. ఈ అక్రమాల వెనుక మాజీ మంత్రి కే. తారక రామారావు (KTR), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఉందని ఆరోపించింది. టీసీఏ ఫిర్యాదులో పేర్కొన్నది ప్రకారం, హెచ్సీఏ ఎన్నికల్లో జగన్మోహన్ రావు విజయం సాధించిన తర్వాత ఆయన విజయం కేటీఆర్, కవిత, హరీష్ రావుకి అంకితమిచ్చినట్టు వ్యాఖ్యానించారు. దీని ద్వారా వీరి ప్రమేయం స్పష్టమవుతోందని టీసీఏ అభిప్రాయపడింది.
హెచ్సీఏలో గత కొంతకాలంగా కొనసాగిన ఆర్థిక దుర్వినియోగం, అవినీతి, లాండరింగ్ వంటి అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ టీసీఏ ఈ ఫిర్యాదు చేసింది. కేవలం కేటీఆర్, కవితే కాకుండా, ఇతర సంబంధిత బాధ్యులపై కూడా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
టీసీఏ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి తదితరులు ఈ ఫిర్యాదును అధికారులకు అందజేశారు. అవినీతి ఆరోపణలు పక్కాగా నిరూపితమైతే, క్రికెట్ పరిపాలన వ్యవస్థ పునరుద్ధరణకు ఇది దారితీయవచ్చని వారు తెలిపారు.