తెలంగాణ

మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్.. కేబినెట్ విస్తరణపై చర్చ!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. సోమవారం హస్తినకు వెళ్లనున్న రేవంత్ రెడ్డి.. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. కేంద్రమంత్రి జేపీ నడ్డాతో భేటీ అయి రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోటా విడుదల కోసం విజ్ఞప్తి చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో రెండో దశ విస్తరణ డీపీఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర, దక్షిణ భాగం అంశాలపై కేంద్ర మంత్రులను కలిసి చర్చించనున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో రేషన్‌కార్డుల సమస్యకు పరిష్కారం చూపేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్హులైన వారికి కొత్త కార్డులు మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో కొత్త తెల్ల రేషన్‌ కార్డుల పంపిణీ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సభకు రావాలని కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీలను ఆహ్వానించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న రేవంత్ సర్కార్.. బీసీ రిజర్వేషన్లపై ఏం చేయాలన్న దానిపై హైకమాండ్ సూచనలు తీసుకోనంది. మరోదఫా మంత్రివర్గ విస్తరణతోపాటు నామినేటెడ్‌ పోస్టులపై కాంగ్రెస్‌ అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button