
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ విస్తరణ కొలిక్కిరాబోతోంది. ఢిల్లీ వెళ్తున్న సీఎం రేవంత్‌రెడ్డి… మంత్రివర్గ విస్తరణ, పదవుల కేటాయింపు విషయంలో అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. ఇప్పటికే AICC ఒక లిస్ట్ కూడా ప్రిపేర్ చేసినట్టు సమాచారం. సీనియారిటీ, సామాజిక సమీకరణాల ఆధారంగా జాబితాను సిద్ధం చేయగా… దీనికి తుదిరూపు ఇవ్వబోతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత… దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ కేబినెట్‌లో ప్రస్తుతం 12 మంది మంత్రులు ఉండగా… ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. ఈ ఆరు స్థానాలతో పాటు డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై కూడా క్లారిటీ తీసుకోనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అలాగే చీఫ్ విప్, కార్పొరేషన్ల చైర్మన్ పదవులు భర్తీ చేయాలని భావిస్తున్నారు. వీటన్నింటిపై పార్టీ పెద్దలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు.
కేబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణాలు పాటించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఖాళీ ఉన్న ఆరు మంత్రి పదవులను… ఇద్దరు బీసీలతోపాటు ఇద్దరు రెడ్డి సామాజికవర్గం నేతలను, ఒక మైనార్టీ, ఒక దళిత నేతతో భర్తీ చేయబోతున్నట్టు సమాచారం. మంత్రివర్గంలోకి రాబోతున్న బీసీలు… మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఓ నేత, నిజామాబాద్‌కు చెందిన మాజీ మంత్రి ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే.. గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన మైనార్టీ నేతకు, నల్లగొండకు చెందిన నేతకు మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించారట. ఇక… కరీంనగర్ జిల్లాకు చెందిన నేతకు కూడా మంత్రి పదవి ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఇక… డిప్యూటీ స్పీకర్ పదవిని లంబాడా వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. అది ఖరారైతే.. నల్లగొండ జిల్లాకు చెందిన నేతకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కుతుంది. అలాగే… రంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ నేతకు చీఫ్ విప్ పదవి ఇవ్వాలని భావిస్తున్నారట. నామినేటెడ్ పదవుల విషయంలోనూ సామాజిక సమీకరణాలు పాటించాలని నిర్ణయించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత… పార్టీలో విస్తృతంగా చర్చ జరిగింది. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాలని భవిష్యత్ చర్యలపై చర్చించారు. ఇందులో భాగంగా… కేబినెట్ విస్తరణ… పదవుల కేటాయింపులు త్వరగా చేయాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ.