
Rain Alert: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడుతాయన్నారు. గురువారం రాత్రి సమయంలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. గచ్చిబౌలి, గండిపేట్, షేక్ పేట్, టోలీ చౌకీ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. రాబోయే మూడు రోజుల్లో ఉత్తర తెలంగాణలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.
వాతావరణశాఖ అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల ఇవాళ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. 115 మిల్లీ మీటర్ల నుంచి 205 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతాయన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అత్యవసరం అయితేనే తప్ప బయటకు రాకూడదన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
ఏపీలోనూ భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీలోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందన్నారు. ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అటు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయన్నారు. అల్లూరి, ఏలూరు జిల్లాల్లో రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: శ్రీశైలానికి భారీ వరదల, సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు!