
కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కృతుడైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆ పార్టీ నాయకత్వంతో తీన్మార్ మల్లన్న సన్నిహితులు చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తే, తెలుగుదేశం పార్టీలో చేరడానికి తీన్మార్ మల్లన్న సుముఖతను వ్యక్తం చేసినట్టు సమాచారం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ నాయకత్వం కూడా భావిస్తోంది. గత కొంతకాలంగా బలమైన నాయకత్వం కోసం ప్రయత్నాలను ప్రారంభించింది. తెలంగాణలో బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని భావిస్తోన్న తెలుగుదేశం పార్టీ తీన్మార్ మల్లన్న ప్రతిపాదనను ఏ మేరకు అంగీకరిస్తుందో చూడాలి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగిన తెలుగుదేశం పార్టీ, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంది. పార్టీ ద్వారా రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకున్న నేతలు సైతం తెలంగాణ సెంటిమెంట్ ను గౌరవిస్తూ, పార్టీకి రాజీనామాలు చేయడం తో ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ బలహీన పడింది. నేతలు తమ రాజకీయ అవసరాల కోసం పార్టీ మారినప్పటికీ, ఇంకా గ్రామీణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడరే ఉండడం గమనార్హం. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినప్పటికీ, తెలంగాణలో మాత్రం నాయకత్వ లేమితో పుంజుకోలేకపోయింది.
రెండవసారి విభజిత ఆంధ్ర ప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ తెలంగాణలోని బలమైన బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించి రాజకీయంగా తమ ఉనికిని చాటుకోవాలని భావిస్తోంది. తెలుగు దేశంలో ఉన్న నాయకత్వలేమిని తనకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్న తీన్మార్ మల్లన్న, భవిష్యత్తులో టిడిపిలో చేరి బలమైన నాయకుడిగా ఎదగాలని వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.