
ఆమన్‌గల్, క్రైమ్ మిర్రర్ : రంగారెడ్డి జిల్లాలోని ఆమన్‌గల్ మండల కేంద్రంలో అవినీతి ఉదంతం ఒకటి బహిర్గతమైంది. రెవెన్యూ శాఖ అధికారులు ప్రజలను నానా తిప్పలు పెట్టుతున్న దుష్ప్రవర్తన మరోసారి వెలుగులోకి వచ్చింది. సదరు ఘటనలో, ఓ వ్యక్తి తన అమ్మమ్మకు చెందిన భూమిని నమోదు చేసుకునేందుకు మరియు సంబంధిత భూమి రికార్డుల్లో ఉన్న తప్పులను సరిచేయాల్సిందిగా సంబంధిత రెవెన్యూ కార్యాలయాన్ని సంప్రదించాడు. కానీ అధికారులు ధర్మం మరిచి, పని చేయాలంటే రూ. 1,లక్ష రూపాయలు లంచం కావాలని తహశీల్దార్ డిమాండ్ చేసినట్లు సమాచారం.
బాధితుడు ఈ విషయాన్ని అవినీతి నిరోధక శాఖ (ACB) దృష్టికి తీసుకెళ్లాడు. అధికారులు ముందస్తు ప్రణాళికతో వల వేసి, రూ. 50 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో తహశీల్దార్ చింతకింది లలిత, సర్వేయర్ కోట రవిని అడ్డగించారు. ఆధారాలతో పట్టుబడిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు విధులను సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉండగా, లంచాల కోసం చేతులు చాస్తే ఎలా అని నిలదీస్తున్నారు. ముఖ్యంగా రైతులు, చిన్న భూ యజమానులు రెవెన్యూ శాఖ వద్ద తమ హక్కులు పొందేందుకు పడుతున్న పాట్లు ఇలాంటి ఘటనల ద్వారా బయటపడుతున్నాయి.
దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడి కావచ్చని ఏసీబీ
అవినీతిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఇద్దరిని విచారణకు తరలించారు. వ్యవహారంలో మరెవరైనా సంబంధం ఉన్నారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.