
మంచిర్యాల,క్రైమ్ మిర్రర్:-గ్రంథాలయాల్లో పాఠకులకు, ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు కావాల్సిన అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ భరోసా ఇచ్చారు. ఆదివారం ఆయన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని సందర్శించి, అక్కడ కల్పిస్తున్న సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా రంగం, గ్రంథాలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. అభ్యర్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్, పోటీ పరీక్షల పుస్తకాలు ఇతర పఠన సామగ్రిని ఇప్పటికే సమకూర్చడం జరిగింది.
గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు తాగునీరు, విద్యుత్ వంటి కనీస వసతులు మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటాం.
ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నియామకాలు చేపడుతోందని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.జిల్లాలోని అన్ని గ్రంథాలయాలను ఆధునీకరించి, అభ్యర్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు గ్రంథాలయాల్లో ఉన్న వనరులను వాడుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు మరియు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.





