
తెలంగాణలో బీజేపీకి కొత్త సారథి ఎవరన్న ఉత్కంఠ కొనసాగుతోంది. కొత్త అధ్యక్షుడు వస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అదిగో ఇదిగో అంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన రాలేదు. అయితే.. తాజాగా కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి ఉన్నట్టుండి ఢిల్లీ వెళ్లడం చర్చగా మారింది. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి ప్రకటన దాదాపు ఖాయమైందనే టాక్ వినిపిస్తోంది. కేంద్ర మంత్రి, ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. షెడ్యూలు ప్రకారం.. జరిగే ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. దాన్ని రద్దు చేసుకొని మరీ ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తు జరుగుతున్న ఈ సమయంలో కిషన్ రెడ్డి ఉన్నపళంగా ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
బుధవారం రాత్రి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీ హైకమాండ్ దాదాపుగా నిర్ణయం తీసుకుందని సమాచారం. కిషన్ రెడ్డితో మాట్లాడాక ఇవాళ లేకా రేపు అధికారికంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది. ఉగాది రోజున కొత్త అధ్యక్షుడు బాధ్యతుల తీసుకునే అవకాశం ఉందని కమలం పార్టీలో చర్చ సాగుతోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి రేసులో చాలామంది నేతలు ఉన్నారు. ముఖ్యంగా ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, ధర్మపురి అర్వింద్, కేంద్ర మంత్రి బండి సంజయ్, సీనియర్ నేతలు మురళీధర్ రావు, రామచంద్రరావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తాను రేసులో లేనని.. పార్టీ ఇస్తే మాత్రం తీసుకుంటానని బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. ఎంపీకి అది కూడా బీసీ నేతకు రాష్ట్ర పగ్గాలు ఇవ్వాలని కమలం పార్టీ పెద్దలు అనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య పోటీ ఉందని తెలుస్తోంది. అయితే పార్టీలో కొత్త కావడం ఈటల రాజేందర్ కు మైనస్ కాగా.. ఆర్ఎస్సెస్ ఆశిస్సులు ఉండటం బండి సంజయ్ కు బలంగా మారింది. కాని కిషన్ రెడ్డి సహా మెజార్టీ పార్టీ నేతలు మాత్రం ఈటల రాజేందర్ పేరు సూచించినట్లు టాక్.