జాతీయం

Justice GR Swaminathan: ఆలయానికి అనుకూలంగా తీర్పు, హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన పెట్టిన విపక్ష ఎంపీలు!

మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌పై ప్రతిపక్ష ఎంపీలు అభిశంసన నోటీసు ఇచ్చారు. జస్టిస్‌ స్వామినాథన్‌ను తొలగించాలని విపక్ష ఎంపీలు స్పీకర్ కు నోటీసులు అందించారు.

Impeachment Notice Against Justice GR Swaminathan: మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌పై ప్రతిపక్ష ఎంపీలు అభిశంసన నోటీసు ఇచ్చారు. జస్టిస్‌ స్వామినాథన్‌ను తొలగించాలని డీఎంకే నేతృత్వంలో విపక్ష ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ ఓమ్‌ బిర్లాకు ఈ నోటీసులు అందజేశారు.

ఆలయానికి అనుకూలంగా తీర్పు ఇచ్చారని అక్కసు

మధురైలోని సుబ్రమణ్య స్వామి ఆలయం సమీపంలో దీపస్థంభంపై దీపం వెలిగించుకోవచ్చని జస్టిస్‌ స్వామినాథన్‌ తీర్పు ఇచ్చారు. ఈ దీపస్థంభం ఆనుకుని దర్గా ఉండడంతో ఈ తీర్పుపై వివాదం నెలకొంది. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో కొంతమంది మతపెద్దలు వెళ్లి దీపం వెలిగించుకోవచ్చని, వారికి సీఆర్‌పీఎఫ్‌ బలగాలు రక్షణ ఇవ్వాలని ఈ నెల 3న న్యాయస్థానం మరోసారి ఆదేశాలిచ్చింది. అయితే, మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మధురై జిల్లా కలెక్టర్‌ హైకోర్టు మధురై బెంచ్‌లో సవాలు చేయడంతో ధర్మాసనం దానిని కొట్టివేసింది. అటు హైకోర్టు ఆదేశాలను డీఎంకే ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది.

హైకోర్టు న్యాయమూర్తిని తొలగించాలని నోటీసు

ఈ వరుస పరిణామాలతో జస్టిస్‌ స్వామినాథన్‌ను తొలగించాలని కోరుతూ డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత కనిమొళి, లోక్‌సభా పక్ష నేత టీఆర్‌ బాలు, ఎస్పీ నేత అఖిలేశ్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ తదితరుల నేతృత్వంలోని బృందం స్పీకర్‌ ఓం బిర్లాకు వందమంది ఎంపీల సంతకాలతో కూడిన లేఖను అందజేసింది.

విపక్షాల నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం

అటు విపక్ష సభ్యులు తీసుకున్న నిర్ణయంపై తమిళనాడు బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి అనుకూలంగా తీర్పు ఇస్తే, హిందూ వ్యతిరేక శక్తులతో కలిసి అక్కడి ప్రభుత్వ పెద్దలు హిందువులకు వ్యతిరేకంగా కోర్టుకెక్కుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా హిందువులంతా ఒక్కతాటి మీదికి రావాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. పెద్ద సంఖ్యలో హిందువులు ఈ ఆందోళనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Back to top button