
మంత్రి పదవి ఆశించి భంగపడిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నెక్స్ట్ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. రాజగోపాల్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై ఆయన అనుచరుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ ఎల్పీ స్టేడియం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమావేశానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరుకాలేదు. అంతేకాదు తాను ఎమ్మెల్యేగా ఉన్న మునుగోడు నియోజకవర్గం నుంచి పార్టీ నేతలను ఎవరిని హైదరాబాద్ వెళ్లనీయ్యలేదు. ఖర్గే సమావేశానికి రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి గ్రామస్థాయి లీడర్లు హాజరయ్యారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహకంగా.. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమావేశానికి రాజగోపాల్ రెడ్డి వెళ్లకపోవడం ఒక ఎత్తైతే.. ఆయన అనుచురులు కూడా వెళ్లకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
2018లో మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. 2022లో బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఆయనకు మంత్రి పదవిపై హామీ దక్కిందని అంటున్నారు.పార్లమెంట్ ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలంటూ మరోసారి మంత్రి పదవి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాని రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. అప్పటి నుంచి ఆయన నారాజ్ గా ఉంటున్నారు. కేబినెట్‌లో మరో పదవి దక్కదంటూ ఏఐసీసీ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే తాజాగా సంకేతాలివ్వడంతో రాజగోపాల్‌రెడ్డి ముందున్న దారులన్నీ మూసుకుపోయాయని చెబుతున్నారు. దీంతో అధిష్టానం.. తీరుపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వాడుకున్నంత వాడుకొని ఇపుడు తనను రోడ్డున ఒదిలేసారంటూ ఒకింత ఆగ్రహంతో ఉన్నారు.
హైదరాబాద్ పర్యటనలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే.. మంత్రిపదవి ఆశించి నిరాశ పడిన ఎమ్మెల్యేలను పిలిపించుకుని మాట్లాడారు. అయితే ఖర్గేతో రాజగోపాల్ రెడ్డి సమావేశం కాలేదు. తనను ఎవరు పిలవలేదని.. అందుకే వెళ్లలేదని కోమటిరెడ్డి చెప్పారు. మంత్రిపదవి ఆశించిన ప్రేమసాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, ఆది శ్రీనివాస్, మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, బాలు నాయక్ ను పిలిపించుకుని మాట్లాడిన ఖర్గే.. రాజగోపాల్ రెడ్డిని ఎందుకు పిలవలేదన్నది చర్చగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వల్లే తనను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావనలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఎల్బీ స్టేడియం వెళ్లాలని ముందు పార్టీ నేతలకు చెప్పిన రాజగోపాల్ రెడ్డి.. సమావేశం ముందు రోజు రాత్రి తన నిర్ణయం మార్చుకున్నారని చెబుతున్నారు. ఖర్గే తనను కనీసం పిలిచి మాట్లాడలేదని కోమటిరెడ్డి గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ఆ అసంతృప్తితోనే ఖర్గే సమావేశానికి రాలేదని అంటున్నారు.