
AI Effect: ప్రపంచ భవిష్యత్తును పూర్తిగా మార్చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంపై మరోసారి ఎలన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్‌లో జరిగిన యూఎస్- సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌లో పాల్గొన్న ఆయన.. రాబోయే దశాబ్దాల్లో మనుషుల జీవనశైలి, ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాల వ్యవస్థ పూర్తిగా మారిపోతుందని స్పష్టంచేశారు. ఏఐ అభివృద్ధి వేగం ఇప్పటికే మన అంచనాలను దాటి పోతుండగా, అది మరికొన్ని సంవత్సరాల్లో ప్రపంచాన్ని పూర్తిగా నూతన దశలోకి తీసుకెళ్తుందని మస్క్ అభిప్రాయపడ్డారు.
మనుషులు ఉపయోగిస్తున్న సంప్రదాయ కరెన్సీ వ్యవస్థ భవిష్యత్తులో అసంబద్ధంగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఏఐ ఒక స్థాయికి చేరినప్పుడు వాణిజ్యం, మార్కెట్లు, ఉత్పత్తి ప్రతిదీ స్వయంచాలకంగా నడవవచ్చు. ఈ పరిస్థితుల్లో మనిషి పని చేసి సంపాదించే మోడల్ గణనీయంగా మారిపోతుందని అన్నారు. ఉద్యోగాలు భవిష్యత్తులో తప్పనిసరి కాకుండా, అభిరుచికి అనుగుణంగా ఎంచుకునే అంశంగా మారతాయని ఆయన స్పష్టంచేశారు. పని అనేది జీవనాధారం కాకుండా శ్రద్ధతో చేసే ఒక వినోదాత్మక లేదా వ్యక్తిగత సంతృప్తి చర్యగా మారే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఏఐ, హ్యూమనాయిడ్ రోబోలు అభివృద్ధి చెందుతూనే ఉన్నందున రానున్న 10-20 ఏళ్లలో పూర్తిస్థాయిలో మనుషులు చేసే పనులు దాదాపు మాయం కావచ్చని ఆయన అన్నారు. ఈ వ్యవస్థలో మానవ శ్రమకి అవసరం తగ్గిపోతుంది. ఇంట్లో రోబోలు అన్ని రకాల పనులను నిర్వహిస్తాయి. దుకాణాలకు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా, ఇండ్లలోనే ఆటోమేటెడ్ విధానంలో ఆహారాన్ని పండించుకునే పరిస్థితి వస్తుందని మస్క్ వివరించారు.
పేదరికం అనేది సామాజిక సమస్య కాదు.. ఇంజనీరింగ్ సమస్య అని ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. టెక్నాలజీ పురోగతి, ఏఐ ఆధారిత స్వయంచాలక వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా వనరుల సమాన పంపిణీకి దారితీస్తాయని, ఈ మార్పులు పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించగలవని ఆయన నమ్ముతున్నారు. మానవాళి చరిత్రలోనే అతిపెద్ద మలుపుగా ఏఐ నిలుస్తుందని, అది తీసుకువచ్చే మార్పులను అర్థం చేసుకుని ముందస్తు ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.
ALSO READ: Politics: రాజీనామా వైపే దానం నాగేందర్ మొగ్గు చూపుతారా..?





