తెలంగాణరాజకీయం

ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి - కాంగ్రెస్‌లో అంతే..!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం కాంగ్రెస్‌లో కసరత్తు సుదీర్ఘంగా జరిగింది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు రాత్రి ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. అద్దంకి దయాకర్‌, శంకర్‌నాయక్‌, విజయశాంతి పేర్లను ఖరారు చేశారు. ఎమ్మెల్సీ రేసులో ఎప్పుడూ విజయశాంతి పేరు వినిపించలేదు. ఆమె.. ఎమ్మెల్సీ కోరుకుంటున్నారని కూడా వార్తలు రాలేదు. కానీ.. అనూహ్యంగా చివరి నిమిషంలో విజయశాంతి పేరు ప్రకటించారు. దీంతో.. అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అది ఎలా..? అంటూ చర్చలు కూడా పెట్టారు. చివరికి కాంగ్రెస్‌లో అంతే.. అంటూ సమాధానపరుచుకున్నారు.

విజయశాంతి… 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. బీజేపీలో మంచి స్థాయిలో ఉండి కూడా హస్తం గూటికి చేరారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందా… లేదా..? అన్న అనుమానాలు కూడా ఉండేవి. ఓటర్ల నాడిని ఎవరూ సరిగా పట్టలేకపోయారు. ఆ పరిస్థితుల్లో కూడా రాములమ్మ డేర్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. అయితే… ఆ సమయంలో ఆమె అధిష్టానం నుంచి ఒక హామీ తీసుకున్నారట. అదే ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని. ఆమె పెట్టిన షరతుకు.. అప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న మాణిక్‌రావ్‌ థాక్రే అంగీకరించారట. అప్పుడు తనకు ఇచ్చిన హామీని అధిష్టానం ముందు పెట్టారట విజయశాంతి. అంతేకాదు… అధిష్టానం పెద్దలతో టచ్‌లో ఉంటూ వచ్చారు. వాళ్ల చుట్టూ తిరిగారు. ఇంకేముందు.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆమె పేరు ఫైనల్‌ అయ్యింది.

కాంగ్రెస్‌… ఒక మహా సముద్రం లాంటిది.. అందులో ఎంతో మంది నాయకులు ఉంటారు. అయితే.. అధిష్టానం ఏది చెప్తే అదే ఫైనల్‌. అందుకే రాములమ్మ తెలివిగా… అధిష్టానంతో టచ్‌లోకి వెళ్లింది. వారితోనే చర్చలు జరిపింది. తనకు ఇచ్చిన హామీని గుర్తుచేసింది. అధిష్టానం కూడా… రాజకీయ సమీకరణాలను లెక్కలేసి.. మహిళా కోటాలో ఆమెకు ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుందని ఆలోచించి.. ఆమె పేరును ప్రకటించింది. పార్టీలు ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉండటంతో… విజయశాంతి ఎమ్మెల్యే అయిపోయినట్టే. 2009లో ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లో అడుగు పెట్టిన రాములమ్మ… ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టబోతోంది. 16ఏళ్ల తర్వాత చట్టసభల్లోకి రాబోతోంది. మరి… రాములమ్మ 2.0 ఎలా ఉండబోతోందో చూడాలి.

Back to top button