తెలంగాణరాజకీయం

తెలంగాణ కేబినెట్‌లో కొత్త మంత్రులు వీళ్లే..!

క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో :  తెలంగాణ కేబినెట్‌లో కొత్తగా ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. ఎవరూ ఊహించని వారు… అమాత్యులయ్యారు. మంత్రి పదవులు దక్కుతాయని అనుకున్న వారి ఆశలు మాత్రం అడియాసలు అయ్యాయి. ఇంతకీ… మంత్రివర్గంలోకి వచ్చిన ఆ ముగ్గురు ఎవరు..?

కొన్ని నెలలుగా అదిగో ఇదిగో అంటున్న కేబినెట్‌ విస్తరణ ఎట్టకేలకు పూర్తయ్యింది. కేబినెట్‌లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. ముడింటిని భర్తీ చేశారు. సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తూ… పదవులు కేటాయించారు. బీసీ కులానికి చెందిన ముదిరాజ్‌ వర్గం నుంచి వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కింది. అలాగే… మాల సామాజికవర్గానికి చెందిన వివేక్‌, మాదిగ సామాజికవర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్‌కు.. మినిస్టర్‌ పోస్టులు ఇచ్చారు. ఇక… మూడు మంత్రి పదవులతోపాటు డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా భర్తీ చేశారు. డిప్యూటీ స్పీకర్‌గా… రామచంద్రనాయక్‌ను ఎంపిక చేశారు.

మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకోవడం పక్కా అంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ… అలా జరగలేదు. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి అందకుండా పోయింది. కోమటిరెడ్డి బద్రర్స్‌లో.. ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వడం కుదరదని కుదరదని పార్టీ అధిష్టానం స్పష్టం చేసినట్టు సమాచారం. ఆ తర్వాత… రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్‌రెడ్డి పేరు కూడా వినిపించింది. సుదర్శన్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి కూడా గట్టిగానే పట్టుబట్టారని వార్తలు వచ్చాయి. కానీ… ఏమైందో ఏమో.. ముఖ్యమంత్రి పట్టుదల కూడా నిలవలేదు. సుదర్శన్‌రెడ్డికి కూడా కేబినెట్‌లో చోటు దక్కలేదు.

భవిష్యత్‌లో వీరికి స్థానం కల్పించే అవకాశం ఉండొచ్చని… పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పుడు ముగ్గురిని మాత్రమే కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఇంకా.. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. చీఫ్‌ విప్‌ పదవిని కూడా భర్తీ చేయాలని భావిస్తోంది కాంగ్రెస్‌ ప్రభుత్వం. మరి… ఈ పదవుల భర్తీ ఎప్పుడుంటుందో తేలాల్సి ఉంది.

Back to top button