
చలికాలం మొదలవడంతో మాంసాహారం ప్రియులకు చికెన్ ధరలు ఊహించని షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. డిమాండ్ ఒక్కసారిగా పెరగడం, సరఫరా పరిమితంగా ఉండటంతో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.310 వరకు చేరింది. ప్రస్తుత సీజన్‌లో ఇదే అత్యధిక ధరగా వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా చలికాలంలో మాంసాహార వినియోగం పెరగడం సహజమే అయినా.. ఈసారి ధరలు అసాధారణంగా పెరగడంతో వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
కొత్త సంవత్సరం వేడుకలు ముగిసినా చికెన్‌పై డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. మరోవైపు సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో కుటుంబ వేడుకలు, శుభకార్యాలు, అతిథి మర్యాదలు పెరుగుతుండటమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారిందని వ్యాపారులు అంటున్నారు. అంతేకాదు, కోళ్ల పెంపకానికి సంబంధించిన మేత, రవాణా, విద్యుత్, కార్మిక వ్యయాలు పెరగడం కూడా ధరలపై ప్రభావం చూపుతోంది. ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే ధరలను పెంచాల్సి వచ్చిందని చికెన్ వ్యాపారులు వివరిస్తున్నారు.
హైదరాబాద్‌లో చికెన్ ధరలు అత్యధికంగా ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం గత వారం పోలిస్తే పెద్దగా మార్పు కనిపించడం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ నగరంలో స్కిన్‌లెస్ చికెన్ ధర కిలోకు రూ.280 నుంచి రూ.310 వరకు పలుకుతోంది. విజయవాడలో కిలో ధర సుమారు రూ.290గా ఉండగా, గుంటూరు, వరంగల్ ప్రాంతాల్లో రూ.300 వరకు ఉంది. విశాఖపట్నంలో రూ.290 ధర కొనసాగుతుండగా, ఖమ్మం జిల్లాలో రూ.270 నుంచి రూ.290 మధ్య ధరలు ఉన్నాయి. కామారెడ్డి ప్రాంతంలో కిలో చికెన్ ధర రూ.280 వరకు ఉన్నట్లు సమాచారం.
చికెన్‌తో పాటు గుడ్ల ధరలు కూడా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. బయట మార్కెట్లో ఒక్క గుడ్డు ధర రూ.8 వరకు ఉండటం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీల నుంచి డిమాండ్ పెరగడంతో గుడ్ల ధరలు కూడా తగ్గే సూచనలు కనిపించడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. పండుగ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో చికెన్, గుడ్ల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.





