జాతీయంతెలంగాణరాజకీయం

Alleti Maheshwar Reddy: సీఎం రేవంత్‌పై రెచ్చిపోయిన ఎమ్మెల్యే

Alleti Maheshwar Reddy: తెలంగాణ రాజకీయ వాతావరణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Alleti Maheshwar Reddy: తెలంగాణ రాజకీయ వాతావరణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే డబ్బును సీఎం తన వ్యక్తిగత అభిరుచులు తీర్చుకోవడానికి వాడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా అంతర్జాతీయ ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీతో ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం ప్రభుత్వం రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందనే అంశంపై ఆయన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల శ్రమతో వచ్చిన ధనాన్ని ఇలా వినియోగించడం ఆర్థిక నేరమని ఆయన స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి తన ఫుట్‌బాల్ సరదా కోసం ప్రభుత్వ ఖజానా నుంచి భారీగా నిధులు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. మెస్సీ వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్రీడాకారుడు ఒక మ్యాచ్ ఆడటానికి మాత్రమే రూ.70 కోట్లు అప్పియరెన్స్ ఫీజుగా తీసుకుంటాడని, ఆ మొత్తం ఎక్కడి నుంచి వస్తుందన్న దానిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉన్నదని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు మెస్సీ వ్యక్తిగత భద్రత, విమాన ప్రయాణం, వసతి వంటి అదనపు ఖర్చులన్నిటిని కూడా తెలంగాణ ప్రభుత్వమే భరిస్తోందని ఆయన వెల్లడించారు. అలా చూస్తే మొత్తం వ్యయం రూ.100 కోట్లు దాటుతుందని అన్నారు.

అంతర్జాతీయ క్రీడాకారుని మ్యాచ్‌ను తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా చూపించడం సిగ్గుచేటు చర్య అని ఆయన విమర్శించారు. గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8, 9 తేదీల్లోనే ముగిసిపోయిందని, కానీ 4 రోజుల తర్వాత జరుగుతున్న ఈ మ్యాచ్‌ను సమ్మిట్‌లో భాగంగా చూపించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన మండిపడ్డారు. మెస్సీ భారత్ పర్యటనను ప్రభుత్వమే ప్రతిపాదించలేదని, ఆర్గనైజర్లే ముందుకొచ్చి ముంబైలో సీఎం రేవంత్ రెడ్డిని కలసి మ్యాచ్ ఏర్పాటు చేయాలని కోరారని ఆయన వివరించారు. అంతకుముందే ఈ మ్యాచ్ ప్లాన్ అయి ఉన్నప్పుడు దానిని గ్లోబల్ సమ్మిట్‌కు అనుసంధానం చేయడం తప్పు నిర్ణయమని స్పష్టం చేశారు.

సింగరేణి నిధులను కూడా ఈ మ్యాచ్ కోసం ఉపయోగిస్తున్నారని వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ.. ఆ నిధులు క్రీడాకారుల అభివృద్ధికి లేదా కార్మికుల సంక్షేమానికి వినియోగించడం మంచిదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ శాఖలు దుబారా ఖర్చులు చేస్తున్నప్పుడు సీఎం అదుపు చేయాల్సి ఉండగా, స్వయంగా సీఎం ఇలా వ్యవహరించడం బాధాకరమని అన్నారు. ప్రజా ప్రయోజనం లేకుండా రూ.100 కోట్లు ఖర్చు చేయడం ప్రభుత్వ నైతికతను ప్రశ్నించే విషయమని ఆయన పేర్కొన్నారు.

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు హైదరాబాద్‌లోని రెడ్ హిల్స్ వద్ద సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నామని తెలిపారు. ఈ మ్యాచ్ రాష్ట్రానికి ఏమి ప్రయోజనం చేకూరుస్తుందో ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి తప్పనిసరిగా సమాధానం చెప్పాలన్నారు. అంతర్జాతీయ క్రీడా కార్యక్రమం పేరుతో ప్రజల డబ్బు వృథా చేయడం ప్రజాస్వామ్యానికి తగదని ఆయన హెచ్చరించారు.

ALSO READ: Telangana: ‘అఖండ-2’ సినిమాకు హైకోర్టులో షాక్

Back to top button