
Israel- Iran Ceasefire: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య యుద్ధానికి శుభంకార్డు పడినట్లు వెల్లడించారు.12 రోజుల యుద్దం ముగిసిందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించారు. 24 గంటల్లోగా దశలవారీగా కాల్పుల విరమణ అమలు అవుతుందన్నారు. ఆ తర్వాత యుద్ధం పూర్తిగా ముగిసిపోయిందని భావించవచ్చని ట్రంప్ తెలిపారు. అయితే, కాల్పుల విరమణకు సంబంధించి ఇరాన్- ఇజ్రాయెల్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇరాన్ దాడులపై స్పందించిన ట్రంప్
తమ అణు స్థావరాలపై అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో ఇరాన్ ప్రతిదాడులకు దిగించింది. గల్ఫ్ లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు చేసింది. ఇరాక్, ఖతార్ లోని అమెరికా బేస్ లపై అటాక్స్ చేసింది. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ దాడులు చాలా బలహీనమైనవని తెలిపారు. ఇరాన్ మొత్తం 14 క్షిపణులను ప్రయోగిస్తే, వాటిలో 13 మిసైల్స్ ను అడ్డుకున్నట్లు తెలిపారు. మిగిలిన దానితో పెద్దగా ప్రమాదం లేకపోవడంతో దాన్ని వదిలేసినట్లు వెల్లడించారు. ఇరాన్ చేసిన ఈ దాడులతో అమెరికా పౌరులతో పాటు ఖతార్ పౌరులకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ట్రంప్ వెల్లడించారు.
ఇరాన్ హెచ్చరికలతో అలర్ట్ అయ్యాం!
అటు ఈ సందర్భంగా ఇరాన్ మీద సటైర్లు వేశారు ట్రంప్. అమెరికాపై ప్రతీకార దాడులు చేస్తామని ఇరాన్ ముందే చెప్పినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఇరాన్ ముందే హెచ్చరికలు చేయడంతో తాము అలర్ట్ అయ్యామన్నారు. అందుకే, ఇరాన్ దాడుల్లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని, అలాగే గాయపడలేదన్నారు. ఇప్పటికైనా ఇరాన్ తన తీరు మార్చుకోవాలని ట్రంప్ సూచించారు. శాంతి వైపు అడుగులు వేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అటు ఇజ్రాయెల్ కూడా శాంతి ఒప్పందం కుదుర్చుకోడానికి తాము ప్రోత్సహిస్తామని చెప్పారు. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు పెరిగిన వేళ శాంతి పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు ట్రంప్!