
Funny video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి రోజు ఎన్నో వీడియోలు వెలుగులోకి వస్తుంటాయి. వాటిలో కొన్నింటి భావోద్వేగం మనసును తాకితే, కొన్ని మాత్రం నవ్వులతో పొంగిపొర్లేలా చేస్తాయి. ముఖ్యంగా జంతువులతో సంబంధం ఉన్న వీడియోలు వైరల్ కావడానికి ఎక్కువ సమయం పట్టదు. ఎందుకంటే వాటి సహజ స్వభావం, అమాయకత్వం, అనుకోకుండా చేసే పనులు మనుషుల్ని ఆకట్టుకుంటాయి. ఇక అలాంటి వాటిల్లోనే ఇప్పుడు భారీగా వైరల్ అవుతున్న ఒక వీడియో, కుక్క బాతుల మధ్య జరిగిన సరదా సన్నివేశం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
— Nature Chapter (@NatureChapter) December 3, 2025
మనుషులు వ్యాయామం చేయడం చూడడం సాధారణమే. జిమ్‌లు, పార్కులు, ఇంటి బయట ట్రెడ్‌మిల్లు ఇవన్నీ దైనందిన దృశ్యాలే. కానీ ఒక కుక్క నిజంగానే మనుషుల్లా ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతూ కనిపించడం మాత్రం చాలా అరుదు. ఈ వీడియోలో అదే జరిగింది. ఇంటి బయట ట్రెడ్‌మిల్‌పై ఒక కుక్క చాలా సీరియస్‌తో, తన పనిలో తాను మునిగిపోయి పరిగెడుతుండగా, అది చూసిన ఎవరికైనా నవ్వు ఆగదు. ఆ కుక్క వ్యాయామం పట్ల చూపిన కట్టుబాటు మనిషికీ ఏమాత్రం తగ్గలేదు.
ఈ క్రమంలోనే కథలో హాస్యానికి గుర్తింపు తెచ్చింది ఓ బాతుల గుంపు. అవే ప్రాంతానికి వచ్చిన బాతులు కుక్క ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తడం చూసి, అది తమకు కొత్తదనంగా అనిపించి ఉందేమో.. కానీ వాటిలో ఒక బాతు వెంటనే కుక్కను వేధించడం మొదలుపెట్టింది. తన ముక్కుతో కుక్కపై దాడి చేస్తూ, ట్రెడ్‌మిల్‌పైనే దానికి చికాకు కలిగించే ప్రయత్నం చేసింది. కానీ ఆ కుక్క మాత్రం ఆశ్చర్యకరంగా ఓపికతో ప్రవర్తించింది. ఒక చిన్న పిల్లాడు ఏదో ఆటపట్టించినట్లు బాతు చేసిన దాడిని పట్టించుకోకుండా కేవలం తన వ్యాయామాన్ని కొనసాగించింది. ఆ సహనంతో పరిగెత్తుతున్న కుక్కను చూసి నెటిజన్లు మరింతగా ఆకట్టుకున్నారు.
అయితే కథ ఇక్కడితో ముగియలేదు. కుక్క ట్రెడ్‌మిల్‌పై ఉన్నంతసేపు బాతులు దానిని వేధించడంలోనే ఉన్నప్పటికీ, కుక్క ట్రెడ్‌మిల్ నుంచి దిగగానే మొత్తం బాతుల గుంపే దాని వైపు పరిగెత్తింది. అవి ఎందుకు అలా చేశాయో స్పష్టంగా తెలియకపోయినా, ఆ దృశ్యం చూసిన ప్రేక్షకులు నవ్వులు ఆపుకోలేక పోయారు. కుక్క మాత్రం ఒకింత ఆశ్చర్యంతో వాటిని చూసి కొద్దిసేపు సందిగ్ధంలో పడింది.
ఈ మొత్తం సంఘటన కేవలం 40 సెకన్ల వీడియోలో బంధించబడింది. @NatureChapter అనే ట్విట్టర్ అకౌంట్ ఈ వీడియోను షేర్ చేయగానే అది దూసుకుపోయి వైరల్ అయింది. ఇప్పటికే 21 వేల కంటే ఎక్కువ మంది దీన్ని వీక్షించగా, వందలాది మంది లైక్స్, కామెంట్స్, ఫన్నీ రియాక్షన్‌లు పంపుతున్నారు. వీడియో చూసిన వాళ్లలో కొందరు ఈ వీడియోలో ఫిట్‌నెస్ కంటే నవ్వే ఎక్కువ ఉందని సరదాగా రాశారు. మరికొందరు కూడా కుక్కలు, బాతులు ఇలా ఫిట్‌గా ఉండాలంటే కలిసి ప్రయత్నిస్తున్నాయేమో అని వ్యాఖ్యానించారు.
ALSO READ: Last Super Moon: కాసేపట్లో అద్భుతం.. ఇవాళ మిస్ అయితే మళ్లీ 2042లోనే!





