
స్టార్ త్రినేత్రం, అన్నమయ్య: ముఖ్యమంత్రి చంద్రబాబు 2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పేదవాడికి సొంతిల్లు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో 3 లక్షల గృహప్రవేశాలకు శ్రీకారం చుట్టిన ఆయన.. లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం కూడా ప్రభుత్వ ప్రాధాన్యమని చెప్పారు. టీడీపీ పేదల సంక్షేమం కోసం పుట్టిన పార్టీ అని గుర్తుచేశారు.
ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు, భవిష్యత్తుకు భద్రత అని పేర్కొన్న చంద్రబాబు, ఉగాది నాటికి మిగతా ఇళ్లు పూర్తి చేసి అప్పగిస్తామని తెలిపారు. ప్రతి ఇంటిపై సౌరఫలకాలను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తామని, పునరుత్పాదక ఇంధనానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. వైసీపీ పాలనలో కేంద్ర పథకాల్లో రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రం నష్టపోయిందని విమర్శించారు.
ప్రకాషం జిల్లా కనిగిరిలో 97 పరిశ్రమలకు పునాది వేశామని, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారవ్వడం లక్ష్యమని వెల్లడించారు. రాయలసీమలో 90 శాతం రాయితీతో డ్రిప్ పరికరాలు అందిస్తున్నామని తెలిపారు. నదుల అనుసంధానం తన జీవితాశయమని, ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యమని హామీ ఇచ్చారు. శ్రీనివాసపురం రిజర్వాయర్ పూర్తిచేసే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. చెరువులు నింపి భూగర్భ జలాలను పెంచుతామని, ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించడంలో నిర్లక్ష్యం ఉండదని అన్నారు.
ALSO READ: Tragedy: బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి.. నిమిషాల వ్యవధిలోనే..





