జాతీయం

మోదీ గారూ న్యాయం చేయండి, పాక్ మహిళ కన్నీటి ఆవేదన!

పాకిస్తాన్ కు చెందిన ఓ మహిళ భారత ప్రధాని మోడీని తనకు న్యాయం చేయాలంటూ కన్నీటి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

“మోడీ గారు.. దయచేసి నాకు న్యాయం చేయండి” అని పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ భారత ప్రధాని నరేంద్ర మోడీని కన్నీటితో వేడుకున్నది. భర్త తనను కరాచీలో వదిలేసి.. భారత్‌ లో రహస్యంగా మరో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులలో తనకు నాకు న్యాయం చేయాలని ప్రధానిని అభ్యర్థించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

పాక్‌కు చెందిన నిఖితా నాగ్‌దేవ్ అనే మహిళ..  విక్రమ్ నాగ్‌దేవ్ అనే వ్యక్తిని 2020 జనవరి 26న హిందూ సంప్రదాయ పద్ధతి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొద్ది రోజులకే 2020 ఫిబ్రవరి 26న ఆమెను ఇండియాకు తీసుకొచ్చాడు. కొన్ని నెలల తర్వాత.. వీసా సమస్య సాకుతో 2020 జులై 9న ఆమెను బలవంతంగా అటారీ సరిహద్దు దగ్గర వదిలేసి ఒంటరిగా పాక్‌కు పంపించారు. మళ్లీ తనను ఇండియాకు తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదని నిఖిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాకు వస్తానని ఎంత బతిమిలాడినా నిరాకరించాడని.. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారామె. ఈ విషయంలో తనకు న్యాయం జరగకపోతే న్యాయవ్యవస్థపై మహిళలకున్న నమ్మకం సన్నగిల్లుతుందని.. తనకు అండగా నిలవాలని అభ్యర్థించారు నిఖిత.

మరో మహిళను పెళ్లి చేసుకునే ప్రయత్నం

తన భర్త ఇప్పుడు ఢిల్లీలో మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని నిఖితా ఆవేదన వ్యక్తం చేసింది. “నేను నిఖితా నాగ్‌దేవ్. విక్రమ్ నాగ్‌దేవ్ భార్యను. కరాచీ నుంచి మాట్లాడుతున్నాను. నా భర్త నన్ను మోసం చేసి.. భారత్‌కు వెళ్లి అక్కడే నివాసముంటున్నాడు. ప్రస్తుతం.. మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్ లో ఉంటూ.. ఇంకొకరిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. నా భర్తపై చర్యలు తీసుకుని అతడిని వెంటనే పాకిస్థాన్‌ కు పంపండి’ అని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసింది. తనకు జరిగిన అన్యాయాన్ని గురించి వివరిస్తూ.. 2025 జనవరి 27న లిఖిత పూర్వకంగా ఫిర్యాదుచేసినట్టు చెప్పుకొచ్చారు.

కొనసాగుతున్న విచారణ

ఈ కేసుపై మధ్యప్రదేశ్ హైకోర్టు అధికారం పొందిన సింధీ పంచ్ మధ్యవర్తిత్వ, న్యాయ సలహా కేంద్రం విచారణ చేపట్టింది.   మధ్యవర్తిత్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి. నిఖిత, విక్రమ్‌లిద్దరూ భారత పౌరులు కాకపోవడంతో.. ఈ కేసు పాక్ పరిధిలోకి వస్తుందని తెలిపింది. విక్రమ్‌ను వెంటనే పాక్‌కు తరలించాలని గత ఏప్రిల్ 30న సిఫార్సు చేసింది. ఈ కేసు ఇండోర్ సోషల్ పంచాయతీ దృష్టికి వెళ్లగా.. సింధీ పంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ విషయమై విచారణకు ఆదేశించినట్టు ఇందోర్ కలెక్టర్ ఆశిస్ సింగ్ ధృవీకరించారు.  ఈ పరిణామాల నేపథ్యంలో నిఖిత తనకు న్యాయం చేయాలంటూ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేస్తూ వీడియో రిలీజ్ చేసింది.

Back to top button