తెలంగాణ

సెప్టెంబర్ రెండో వారంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్!

Telangana Local Body Elections: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబరు రెండో వారంలో నోటిఫికేషన్‌ రానుంది. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీ సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీలకు ఆ తర్వాత నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లులను ఆమోదించి, తరువాత దానికి సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఆదివారం రెండు బిల్లులు ఆమోదం పొందితే రెండు రోజుల్లో  జీవో రానుంది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు తేల్చితే బీసీల స్థానాల కేటాయింపునకు మరో వారం రోజుల గడువు కావాలని ఎన్నికల సంఘం చెప్పినట్లు తెలిసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను సెప్టెంబరు 10 నాటికి ప్రకటించాలని ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇవన్నీ చూస్తే సెప్టెంబరు రెండో వారంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది.

హైకోర్టు ఆదేశం మేరకు..

జూలై 25 వరకు రాష్ట్రంలో రిజర్వేషన్లను ఖరారు చేసి, సెప్టెంబరు 30 లోపు స్థానిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.  కోర్టు సూచన నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారుకు ప్రత్యేక కమిషన్‌ ఇచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకుని దాని ప్రకారం ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులను విడుదల చేయనుంది. అనంతరం స్థానిక ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సమాచారం ఇస్తుంది.

తుది ఓటర్ల జాబితాకు నోటిఫికేషన్‌

గ్రామ పంచాయతీల ఓటరు జాబితాల ప్రకటనకు ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే నోటిఫికేషన్‌ ఇచ్చింది. తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీల పరిధిలోని ఓటరు జాబితాల సవరణ, తుది ఓటరు జాబితా ఖరారు, పోలింగ్‌ కేంద్రాల వివరాల ప్రకటనకు  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని నోటిఫికేషన్‌ విడుదల చేశారు. సెప్టెంబరు 6న మండల, జిల్లా పరిషత్‌ కార్యాలయాల్లో ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్‌ కేంద్రాల సమాచారాన్ని ప్రదర్శిస్తారు. 8న రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా, మండల స్థాయి ఎన్నికల అధికారులతో సమావేశాలుంటాయి. వాటిలో తెలిపే అభ్యంతరాలను పరిశీలించి 10న తుది ఓటర్ల జాబితాను ఖరారు చేస్తారు.

Back to top button