అజిత్ పవార్ రాజకీయ వారసులు ఎవరో అని తేలిపోయింది. ఆయన కుమారులను కాదని, సతీమణి సునేత్ర పవార్ కు ఎన్డీఏ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతోంది. ఇవాళ ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ పదవి చేపట్టాలని పార్టీ నేతలు చేసిన విజ్ఞప్తికి ఆమె అంగీకారం తెలిపారని సీనియర్ నాయకుడు, మంత్రి ఛగన్ భుజ్‌బల్ వెల్లడించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న ఆమెను ఇవాళ తమ శాసనసభాపక్ష నేతగా ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు.
ఏ శాఖలు కేటాయిస్తారంటే?
అటు దివంగత పవార్ ఉపముఖ్యమంత్రిగా ఆర్థిక, ప్రణాళికా శాఖలు చూసేవారు. ఎక్సైజ్, యువజన సంక్షేమం, మైనారిటీల అభివృద్ధి, క్రీడల శాఖలు చూసేవారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంది. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో సునేత్ర ఆర్థిక శాఖ వంటి కీలక శాఖను నిర్వహించలేరని.. ఆమెకు ఎక్సైజ్, క్రీడల శాఖలు ఇస్తామని.. ఆర్థిక శాఖ ప్రస్తుతానికి సీఎం ఫడణవీస్ దగ్గరే ఉంటుందని బీజేపీ నాయకత్వం ఎన్సీపీ నేతలకు స్పష్టం చేసినట్లు తెలిసింది. బడ్జెట్ సమావేశాల తర్వాత ఆర్థిక శాఖను ఎన్సీపీకి ఇస్తామని ప్రతిపాదించిందని.. ఇందుకు వారు సమ్మతించినట్లు సమాచారం. అజిత్ మరణంతో బారామతి అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఉప ఎన్నికలో సునేత్ర బరిలోకి దిగనున్నారు.
రెండు ఎన్సీపీల విలీనంపై చర్చలు
మరోవైపు… రెండు ఎన్సీపీల విలీనం ఖాయమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ-ఎస్పీ, దివంగత అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ రెండు వారాల్లో కలిసిపోతాయని రెండు వర్గాల నుంచీ సంకేతాలు అందుతున్నాయి. అయితే విలీనం తర్వాత పార్టీకి ఎవరు నేతృత్వం వహించాలన్న అంశంపై ప్రస్తుతం పవార్ కుటుంబంలో జోరుగా చర్చలు సాగుతున్నట్లు సమాచారం. పవార్‌తో పాటు అజిత్ భార్య సునేత్ర పవార్, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలె, ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ రేసులో ఉన్నట్లు తెలిసింది. కాగా, బారామతి విమాన ప్రమాదంపై రాష్ట్ర సీఐడీ విభాగం దర్యాప్తు ప్రారంభించింది.





