
తెలంగాణ రాజకీయాల్లో జీహెచ్ఎంసీ విస్తరణ నిర్ణయం చర్చనీయాంశంగా మారగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. వరంగల్ పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ నిర్ణయం ఎవరి ప్రయోజనాల కోసం తీసుకున్నదో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో, మున్సిపాలిటీలతో చర్చించకుండా పెద్ద స్థాయిలో విస్తరణ చేపట్టడం ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్ధమని మండిపడ్డారు. పెద్ద మాల్స్ నిర్మించేందుకు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ వ్యక్తులకు తక్కువ ధరకే భూములు అప్పగిస్తున్నారని ఆరోపించిన కేటీఆర్, ఇది ప్రజల అవసరాల కంటే ప్రైవేట్ వ్యాపారాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్న సంకేతమని వ్యాఖ్యానించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని విరుచుకుపడ్డారు.
అంతేకాకుండా, వరంగల్ టెక్స్టైల్ పార్క్ పనులను వేగవంతం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ పార్క్ పూర్తయితే సుమారు నలభై వేల మందికి ఉపాధి లభిస్తుందని గుర్తుచేసిన ఆయన, ఇప్పటికే రెండు మూడు కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టులు ఆలస్యమవ్వడం ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించిన కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ చేసిన హామీలు కేవలం ఎన్నికల మాయాజాలమేనని తీవ్రంగా విమర్శించారు. గతంలో బీసీ రిజర్వేషన్లు 24 శాతం ఉండగా ఇప్పుడు అవి 17 శాతానికి పడిపోయాయని తెలిపారు. కొన్ని మండలాల్లో ఒక్క గ్రామానికి కూడా రిజర్వేషన్లు పడలేదని అన్నారు. పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో పార్టీ ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ: జగిత్యాల జిల్లాలో ఘోరం: ప్రేమ జంటపై దాడి, అమ్మాయి కిడ్నాప్..!





