
శంషాబాద్,తెలంగాణ:- తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టిడబ్ల్యూజేఎఫ్ నేషనల్ కౌన్సిల్ సభ్యులు బి. దేవేందర్ అన్నారు. మంగళవారం. టి డబ్ల్యూజేఎఫ్ రాజేంద్రనగర్ నియోజకవర్గస్థాయి సమావేశం శంషాబాద్ మండలంలోని నర్కూడ గ్రామ పరిధిలో ఆ యూనియన్ అధ్యక్షులు అలమనేటి గోపాల్ అధ్యక్షతన జరిగింది. గత మూడు నెలలుగా చేపట్టిన కార్యక్రమాలు నివేదికను కార్యదర్శి ఇ. బుచ్చన్న ప్రవేశ పెట్టారు. గత కార్యక్రమాలను సమీక్షించి చర్చించిన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు కలాల్ సుదర్శన్ గౌడ్ తో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ జర్నలిస్టులకు చేసింది ఏమీ లేదని తెలిపారు. గత ప్రభుత్వం లాగానే కొత్త ప్రభుత్వం కూడా జర్నలిస్టులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా జర్నలిస్టులకు కొత్త అక్రి డిటేషన్ కార్డులు ఇవ్వకుండా స్టిక్కర్ వేసి కాలయాపన చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు అనేక హామీలు ఇచ్చారని వాటిని జర్నలిస్టులు నమ్మి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి కృషి చేశారని తెలిపారు. కానీ అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టుల సమస్యలు గాలికి వదిలేసారని విమర్శించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం వెంటనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్హులైన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు , ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు పాఠశాలలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలన్నారు. లేదంటే యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏ. భానుమూర్తి, ఎం. శ్రీనివాస్, పి. నర్సింహ యాదవ్, పి. యాదగిరి, కోళ్ల యాదయ్య, ఆర్. జ్ఞానేశ్వర్ , మద్దూరి శ్రీనివాస్, కె . సతీష్ బాబు, విజయ్, మంచర్ల రవీందర్, సుధీర్ కుమార్, కే. ప్రవీణ్ కుమార్, హరీశ్వర్ రెడ్డి , కిట్టు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.





