
India GDP 2025-26 Q2: భారత ఆర్థిక వ్యవస్థ మరోసారి తన శక్తిని ప్రపంచానికి రుజువు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికం దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాలను మించి నమోదై ఆర్థికవేత్తల దృష్టిని ఆకర్షించింది. ఈ Q2లో భారత్ సాధించిన 8.2 శాతం వృద్ధి రేటు గత ఆరు త్రైమాసికాల్లోనే అత్యధికంగా నిలవడం గమనార్హం. మొదటి త్రైమాసికంలో నమోదైన 7.8 శాతం కంటే కూడా ఈ వృద్ధి ఎక్కువే. గత ఏడాది ఇదే కాలంలో వృద్ధి రేటు 5.6 శాతం మాత్రమే ఉండటం ఇప్పుడు భారత్ ఎంత వేగంగా ఆర్థికంగా పురోగమిస్తోంది అనే విషయాన్ని స్పష్టంగా చూపిస్తుంది.
ఈ ఏడాది అమెరికా సుంకాల పెంపు భారత ఎగుమతులపై ఒత్తిడి పెంచినప్పటికీ, మొత్తం ఆర్థిక వ్యవస్థ మాత్రం విశ్లేషకుల అంచనాలను మించి ఎదిగింది. ఇందులో గ్రామీణ వినియోగం పెరగడం, ప్రభుత్వ వ్యయాలు గణనీయంగా పెరగడం ముఖ్య పాత్ర పోషించాయి. ప్రైవేట్ రంగం పెట్టుబడులు ఆశించినంతగా లేకపోయినా, మొత్తం జీడీపీ వృద్ధి బలంగా కొనసాగింది. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ రేట్ల తగ్గింపు ఈ త్రైమాసికంపై పెద్దగా ప్రభావం చూపకపోయినా, పండుగల కాలంలో కొనుగోళ్లు పెరగడం ఆర్థిక వృద్ధికి పెద్ద ఊతంగా మారింది.
ప్రపంచ వాణిజ్యంలో కొనసాగుతున్న అనిశ్చితి, గ్లోబల్ మార్కెట్లలోని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, భారతీయ వినియోగదారుల వ్యయం, తయారీ రంగం ఉత్సాహంగా ముందుకు సాగాయి. ముఖ్యంగా తయారీ రంగమే ఈసారి ఆర్థిక వృద్ధిలో ప్రధాన శక్తిగా నిలిచింది. భారత జీడీపీలో దాదాపు 14 శాతం వాటా కలిగిన ఈ రంగం ఈ త్రైమాసికంలో 9.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే సమయంలో ఈ సంఖ్య 2.2 శాతం మాత్రమే ఉండటం తయారీ రంగం ఎంత వేగంగా పునరుద్ధరణ చెందిందో చూపిస్తుంది. వ్యవసాయం సహా పలు కీలక రంగాల్లో పన్నులు తగ్గించడం కూడా వృద్ధికి తోడ్పడింది.
ప్రస్తుతం భారత్ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ, వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆర్థిక పటంలో మరింత ముందుకు దూసుకుపోయే సామర్థ్యం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. 2030 నాటికి భారత్ ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే భారత్ పూర్తిస్థాయి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే కనీసం మరో 22 సంవత్సరాలు సగటున 7.8 శాతం స్థిరమైన వృద్ధిని కొనసాగించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ:





