తెలంగాణ

ఎడతెరిపిలేని కుండపోత.. ఉత్తర తెలంగాణ కకావికలం!

Rain Disaster: కుండపోత వర్షాలతో ఉత్తర తెలంగాణ చిగురుటాకులా వణికింది. అతి భారీ వానలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. నిర్మల్‌, మెదక్‌, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో వర్షం తీవ్ర ప్రభావం చూపింది. వాగులు, వంకలు పోటెత్తి.. చెరువులు తెగిపోయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, వంతెనలు, రైల్వే లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగిపోయింది. వరద ఉధృతికి రహదారులు కొట్టుకుపోయి రాకపోకలు స్తంభించిపోయాయి. వందలాది గ్రామాలు జలదిగ్బధంలో చిక్కుకున్నాయి. కరెంటు సరఫరా నిలిచిపోయి అంధకారంలో మగ్గుతున్నాయి. భారీ వరదలకు పదిమందికిపైగా గల్లంతైనట్టు తెలిసింది.

కామారెడ్డిలో వరదల కల్లోలం

ఏకధాటి వానలతో కామారెడ్డి కకావికలమైంది. జిల్లా కేంద్రంలోని వందలాది కాలనీలు నీటి మునిగాయి. దాదాపుగా 40 గంటల పాటు ప్రజలు ఇండ్లకే పరిమితం కావాల్సి వచ్చింది.  కామారెడ్డి పెద్ద చెరువు ఎన్నడూ లేని విధంగా అలుగు దుంకడంతో సమీప ప్రాంతాల నివాసితులు ప్రాణభయంతో వణికిపోయారు. పదుల సంఖ్యలో వాహనాలు కొట్టుకు పోయాయి. రోడ్లవెంట నిలిచి ఉంచిన లారీలు, భారీ వాహనాలు వరద ధాటికి చెల్లాచెదురయ్యాయి. రోడ్లు నామ రూపాల్లేకుండా పోయాయి.  ఎల్లారెడ్డి నుంచి హైదరాబాద్‌ మార్గంలో చెరువు తెగి రాకపోకలు బందయ్యాయి.  జిల్లా వ్యాప్తంగా 36కు పైగా చెరువులు తెగినట్టు ఇరిగేషన్‌ శాఖ ప్రకటించింది. మంజీరా ఉగ్రరూపం, నిజాంసాగర్‌ గేట్లు ఎత్తి దిగువకు లక్షన్నర క్యూసెక్కులు వదలడంతో దిగువన అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి.  భారీ వర్షానికి ఎన్‌హెచ్‌ 44 నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది.  భిక్కనూర్‌ మండలం రామేశ్వరపల్లి శివారులో భిక్కనూర్‌ – తలమడ్ల రైల్వే స్టేషన్‌ మధ్య వరద ఉధృతికి రైల్వే ట్రాక్‌ కొట్టుకు పోయింది. రైళ్ల రాకపోలకు బంద్ అయ్యాయి. పోచారం ప్రాజెక్టు ప్రమాద ముప్పు అంచుల్లోకి వెళ్లి సురక్షితంగా బయట పడింది. వరద ప్రవాహం ప్రాజెక్టు అంచుల్లో నుంచి కిందికి జారుకుంది. ఈ క్రమంలో ఆనకట్ట మట్టి పూర్తి స్థాయిలో కొట్టుకుపోవడంతో దిగువ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

జల దిగ్బంధంలో నిర్మల్, మెదక్

నిర్మల్‌ పట్టణంలోని చాలా కాలనీలు నీట మునిగాయి. జీఎన్‌ఆర్‌ కాలనీవాసులు ఇండ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. కుంటాల మండలం జలదిగ్బంధంలో చిక్కుకున్నది.  వాగులు, వంకలు ఉప్పొంగి చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు కొట్టుకుపోయి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్‌ నుంచి ఆదిలాబాద్‌ వెళ్లే పాత జాతీయ రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. బాసర మండలం బిద్రెల్లి వద్ద వాగు ఉధృతికి భైంసా -నిజామాబాద్‌ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. వరద పోటెత్తడంతో కడెం, స్వర్ణ, గడ్డెన్న వాగు ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు.  మెదక్‌ జిల్లాలో 40 ఏండ్లలో ఎన్నడూ పడని విధంగా భారీ వర్షం కురిసింది.     నిజాంసాగర్‌ గేట్లు ఎత్తి వరదను వదలకపోవడంతో అనేక గ్రామాల్లో పంటలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. కుండపోత వర్షానికి సిద్దిపేట జిల్లా కేంద్రం చిగురుటాకులా వణికిపోయింది. పలు కాలనీలు నీట మునిగాయి.

Back to top button