
పెబ్బేరు, క్రైమ్ మిర్రర్: వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణానికి చెందిన ప్యారసాని సత్యనారాయణ అనే వ్యక్తి అదృశ్యమైందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, చివరికి ఆయన సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. పెబ్బేరు ఎస్ఐ యుగంధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం – సత్యనారాయణ ఈ నెల ఆగస్టు 3న తమిళనాడులోని అరుణాచలం (తిరువన్నామలై) తీర్థయాత్రకు వెళ్తున్నానని చెప్పి గద్వాలలో ట్రైన్ ఎక్కి బయలుదేరాడు. ఆగస్టు 5వ తేదీ వరకు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో సంప్రదింపులు కొనసాగించినా, ఆ తరవాత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో సంబంధం తెగిపోయింది.
సత్యనారాయణ తరచూ తీర్థయాత్రలకు వెళ్తూ రావడం వల్ల కుటుంబ సభ్యులు మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆలస్యం కావడంతో, ఆగస్టు 12న తల్లి సుశీలమ్మ పెబ్బేరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఆదివారం ఉదయం సత్యనారాయణ తిరిగి ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల విచారణలో ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
“తిరువన్నామలై గిరిప్రదక్షిణ చేస్తున్న సమయంలో నా ఫోన్ పోగొట్టుకున్నాను. దాంతో ఇంటికి సమాచారం ఇవ్వలేకపోయాను. గిరిప్రదక్షిణలోని ధ్యానం మందిరంలో కొన్ని రోజులు ఉండడం వల్ల బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధం కోల్పోయాను” అని సత్యనారాయణ స్పష్టం చేశారు.
సత్యనారాయణ సురక్షితంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యుల ఆందోళన తీరింది. పోలీసులు కేసును మూసివేశారు.