క్రైమ్జాతీయం

Shocking: ప్రెగ్నెంట్ చేస్తే రూ.10 లక్షలు!

మోసపోయేవాళ్లు ఉన్నంతవరకూ మోసం చేసేవాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారన్న మాటను నిజం చేస్తూ బిహార్‌లో ఒక విచిత్రమైన, భయంకరమైన సైబర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది.

మోసపోయేవాళ్లు ఉన్నంతవరకూ మోసం చేసేవాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారన్న మాటను నిజం చేస్తూ బిహార్‌లో ఒక విచిత్రమైన, భయంకరమైన సైబర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈజీ మనీ కోసం ఇప్పటికే ఎన్నో మోసాలు చూస్తున్నాం. కానీ, పురుషుల కోరికలను టార్గెట్ చేసి సాగిన ఈ మోసం మాత్రం ఇప్పటివరకు ఎవ్వరూ ఊహించనిది. దీనికే ఇప్పుడు ‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ స్కామ్’ అనే పేరు పెట్టారు.

పిల్లలు లేని జంటలకు పిల్లలు పుట్టించడమే తమ సంస్థ లక్ష్యమని చెప్పుకుంటూ మోసగాళ్లు రంగంలోకి దిగారు. చాలాకాలంగా సంతానం లేని మహిళను గర్భవతిని చేయగలిగితే రూ.10 లక్షలు ఇస్తామని, ఒకవేళ విఫలమైతే కూడా రూ.5 లక్షలు చెల్లిస్తామని ఆకర్షణీయంగా ప్రచారం చేశారు. వినడానికి వింతగా ఉన్నా, డబ్బు ఆశతో కొందరు ఈ వలలో చిక్కుకున్నారు.

ఆన్‌లైన్‌లో ఆకర్షణీయంగా కనిపించే యువతుల ఫొటోలను ఉపయోగించి ప్రకటనలు ఇచ్చారు. ‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్’ పేరుతో దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నామని, ఏ రాష్ట్రానికి చెందిన వారికైనా ఉద్యోగం ఇస్తామని నమ్మించారు. ఆ ప్రకటనలను చూసి నిజమేనని భావించి ఫోన్ చేసిన వారిని దశలవారీగా మోసం చేశారు.

మొదట రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో రూ.799 కట్టాలని చెప్పారు. అనంతరం “మీ పేరు షార్ట్ లిస్ట్ అయింది” అంటూ కాల్ చేసి, సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు డబ్బులు వసూలు చేశారు. అక్కడితో ఆగకుండా స్పెర్మ్ టెస్ట్, కోర్టు నుంచి ఎన్ ఓ సి, జీఎస్టీ ఛార్జీలు అంటూ ఒక్కొక్క కారణం చూపుతూ మరింత డబ్బు గుంజారు.

ఇక్కడే మోసం అత్యంత ప్రమాదకర మలుపు తిరిగింది. బాధితుల ఫొటోలు తీసుకుని వాటితో మార్ఫింగ్ వీడియోలు తయారు చేసి, అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో లీక్ చేస్తామని బెదిరించారు. దీంతో పరువు పోతుందన్న భయంతో చాలామంది మరింత డబ్బులు చెల్లించారు.

ఈ స్కామ్‌లో మోసపోయిన కొందరు చివరకు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నవాడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మన్వాడ గ్రామంలో రహస్యంగా ఈ స్కామ్‌ను నడుపుతున్న కేంద్రంపై దాడులు చేసి, ఓ మైనర్ సహా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులపై BNS 318 (4) చీటింగ్, 336 (3) ఫోర్జరీతో పాటు ఐటీ యాక్ట్ కింద పలు సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు 100 మందికి పైగా బాధితుల నుంచి రూ.50 లక్షలకు పైగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ డబ్బును యూపీఐ మ్యూల్ అకౌంట్లకు బదిలీ చేసి, తర్వాత క్రిప్టో కరెన్సీ, గేమింగ్ యాప్‌ల ద్వారా వైట్ మనీగా మార్చినట్లు దర్యాప్తులో తేలింది.

ఈ సందర్భంగా ఎస్పీ ధీమాన్ కీలక హెచ్చరిక చేశారు. చట్టబద్ధంగా ఏ ఉద్యోగానికి ముందస్తు రిజిస్ట్రేషన్ ఫీజులు ఉండవని స్పష్టం చేశారు. ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను emigrate.gov.in లేదా Naukri వంటి అధికారిక వెబ్‌సైట్లలో మాత్రమే చెక్ చేసుకోవాలని సూచించారు. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ALSO READ: చెల్లి అంటూనే వివాహితపై కన్నేశాడు, ఆపై ఘోరం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button