ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో భారీ వర్షాలు.. మత్స్యకారులకు కీలక హెచ్చరికలు!

AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఒరిస్సాలోని భవానీ పట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. ఈ వాయుగుండం దక్షిణ ఒరిస్సా, దక్షిణ చత్తీస్‌ గఢ్ మీదుగా ప్రయాణించి అల్ప పీడనంగా మారే అవకాశం ఉందని చెప్పింది. దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది.

పోర్టులలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ

వాయుగుండం ఎఫెక్ట్‌ తో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిస్థితిపై వైజాగ్ తుపాను హెచ్చరిక కేంద్రం జగన్నాథ్ కుమార్ తెలిపారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కుస్తాయని చెప్పారు. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. అటు అన్ని పోర్టులలోనూ మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు తెలిపారు. కోస్తా తీరంలో 45 నుంచి 55 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లవొద్దని హెచ్చరించారు.

ప్రజల అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు 

భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదన్నారు. వ్యవసాయ పనులకు వెళ్లిన వారు చెట్ల కిందికి వెళ్లకూడదన్నారు. సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలన్నారు. వర్షం పడే సమయంలో ప్రజలు వీలైనంత వరకు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడం మంచిదన్నారు.

Back to top button