తెలంగాణ

అమెరికాకు కేసీఆర్.. అరెస్ట్ భయంతోనేనా?

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అమెరికాకు వెళ్లనున్నారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరుగుతుండగా కేసీఆర్.. అమెరికా వెళుతున్నారనే వార్తలు సంచలనంగా మారాయి. అక్రమాలు బహిర్గతం కావడంతో అరెస్ట్ ఖాయమనే సంకేతం రావడంతో ఆమెరికా వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ వర్గాలు మాత్రం రెస్ట్ కోసమే వెళుతున్నారని చెబుతున్నాయి.

కేసీఆర్ ఇప్పటివరకు అగ్రరాజ్యమైన అమెరికాకు వెళ్లలేదు. అంతే కాదు.. రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్..చేపట్టిన విదేశీ పర్యటనలు కేవలం రెండంటే రెండు మాత్రమే. అందులో ఒకటి సింగపూర్, రెండోది చైనా. అంతకు మించి కేసీఆర్.. తన జీవితకాలంలో దేశం దాటలేదు. అయితే తొలిసారి.. అమెరికాకు కేసీఆర్ వెళ్లనున్నట్లు సమాచారం. సుమారు 35 ఏళ్లకుపైగా సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగుతున్న కేసీఆర్.. కేవలం రెండే రెండు ఫారిన్ టూర్‌లతో.. దేశంలోనే అత్యంత తక్కువ విదేశీ పర్యటనలు చేసిన ముఖ్యమంత్రిగా నిలిచారు.

తాజాగా అమెరికా వెళ్లేందుకు గులాబీ బాస్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఒకటి రెండు నెలల్లో కేసీఆర్ అమెరికా ప్రయాణం ఉంటుందని తెలుస్తోంది. అమెరికా వెళ్లనున్న కేసీఆర్.. సుమారు 2 నెలల పాటు అక్కడే ఉండే అవకాశం ఉందని సమాచారం. కేటీఆర్ కుమారుడు హిమాన్షు అమెరికాలోనే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.తన మనవడు హిమాన్షు కోరిక మేరకే తాత కేసీఆర్ అమెరికా వెళ్తున్నట్లు సమాచారం. కొన్ని రోజులు అమెరికా వచ్చి రెస్ట్ తీసుకోవాలని.. ఇటీవల ఇండియా వచ్చిన హిమాన్షు తాతను కోరినట్లు తెలుస్తోంది.

 

Back to top button