
Actress Celina Jaitley: బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త, ఆస్ట్రియాకు చెందిన వ్యాపారవేత్త పీటర్ హాగ్‌తో ఉన్న దాంపత్య వివాదం మరింత తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పటికే గృహహింస ఆరోపణలతో కేసు నమోదు చేసిన సెలీనా.. ఇప్పుడు భర్త నుంచి భారీ ఆర్థిక భద్రత కోరుతూ కోర్టును ఆశ్రయించారు. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలంటూ న్యాయస్థానంలో స్పష్టంగా వాదనలు వినిపించినట్లు సమాచారం.
ఈ వ్యవహారంలో భాగంగా సెలీనా జైట్లీ భర్త నుంచి రూ.100 కోట్ల పరిహారం చెల్లించాలని, అలాగే ప్రతి నెల రూ.10 లక్షల భరణం ఇవ్వాలని కోర్టును కోరారు. ముంబై అంధేరిలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసుకు సంబంధించి దంపతులు ఇద్దరూ హాజరయ్యారు. విచారణ సందర్భంగా ఆర్థిక అంశాలపై కీలక చర్చ జరగగా, ఇరువురి ఆదాయ వివరాలు స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలో సెలీనా జైట్లీతో పాటు పీటర్ హాగ్ కూడా తమ తమ ఆదాయ అఫిడవిట్లను జనవరి 27 లోపు కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. భరణం, పరిహారం వంటి అంశాలపై తుది నిర్ణయం తీసుకునే ముందు ఇరువురి ఆర్థిక స్థితిగతులు పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది.
2011లో పెళ్లి చేసుకున్న ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా వారి మధ్య ఏర్పడిన విభేదాలు న్యాయస్థానానికి చేరడంతో ఈ కేసు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సెలబ్రిటీ జీవితంలో మరోసారి దాంపత్య వివాదాలు వెలుగులోకి రావడంతో, ఈ కేసు ఎలాంటి తీర్పు దిశగా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ALSO READ: జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు అప్లై చేశారా?





